విజయవాడలో శిల్పారామం క్రాప్ట్ మేళా... నవంబర్ 3 నుండి 12 వరకూ...
అంతరించిపోతున్న చేతి వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ నేతృత్వంలో శిల్పారామం ఆర్ట్స్, క్రాప్ట్స్, కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా శిల్పారామం క్రాప్ట్ మేళా పేరిట రాష్ట్రస్ధాయి ప్రదర్శన, అ
అంతరించిపోతున్న చేతి వృత్తులను ప్రోత్సహించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ నేతృత్వంలో శిల్పారామం ఆర్ట్స్, క్రాప్ట్స్, కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా శిల్పారామం క్రాప్ట్ మేళా పేరిట రాష్ట్రస్ధాయి ప్రదర్శన, అమ్మకం చేపడుతున్నట్లు సొసైటీ ప్రత్యేక అధికారి జయరాజు తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పురాతన హస్తకళలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఈ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. మధ్యవర్తి రహితంగా వినియోగదారులకు ఉత్పత్తులు చేర్చటం ద్వారా అటు ఉత్పత్తిదారులకు, ఇటు కొనుగోలు దారులకు మేలు జరుగుతుందన్నారు.
మరోవైపు కనుమరుగవుతున్న గ్రామీణ కళలను ప్రోత్సహించటమే ధ్యేయంగా శిల్పారామం ఈ ప్రదర్శనలను నిర్వహిస్తుందని జయరాజ్ వివరించారు. గ్రామీణ చేతి వృత్తులను ప్రోత్సహించటం శిల్పారామం ఆర్ట్స్, క్రాప్స్ట్ అండ్ కల్చరల్ సొసైటీ ప్రధాన ధ్యేయమని, చేతి వృత్తుల వారు తమ ఉత్పత్తులు, కళాకృతులను నేరుగా విక్రయించుకోగలిగేలా శిల్పారామం పనిచేస్తుందన్నారు.
ప్రతి జిల్లాలోనూ ఒక శిల్పారామం అభివృద్ది చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, తద్వారా చేతి వృత్తిదారుల విక్రయాలకు ఒక వేదిక ఏర్పాటు అవుతుందన్నారు. పటమట ఎన్‌టిఆర్ సర్కిల్ సమీపంలోని మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ రాష్ట్ర స్థాయి క్రాప్ట్ మేళా జరుగుతుందని ఈ నెల మూడవ తేదీ నుండి 12 తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఉదయం 11 గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని జయరాజ్ పేర్కొన్నారు.
వివిధ రాష్ట్రాల నుండి వందకు పైగా కళాకారులు ఈ ప్రదర్శనలో తమ చేతివృత్తులను వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారని, మార్కెట్ ధరలతో పోల్చితే మెరుగైన రాయితీ కూడా లభిస్తుందన్నారు. హస్త కళాకారుల నుండి కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, ఇత్తడి, రాగి ఆర్టిస్టిక్ మెటల్ వస్తువులు, బంజార హ్యండ్ ఎంబ్రయిడరీ, హైదరబాద్ పెరల్స్ అండ్ జ్యూయలరీ, జూట్ బ్యాగ్‌లు, సిల్వర్, రోల్డ్ గోల్డ్ ఆర్టికల్స్, మదనపల్లి, టెర్రకోట పోటరీ ఐటమ్స్, రుద్రాక్షలు, పూజా సామాగ్రి, లెదర్ యుటిలిటీ గూడ్స్ లను వినియోగదారులు సరసమైన ధరలకు కొనుగోలు చేయవచ్చన్నారు.
హ్యండ్‌లూమ్స్ విభాగంలో మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, చీరాల, కలంకారి, పొందూరు ఖద్దరు, బెంగారి కాటన్. కాశ్మీరీ సిల్క్, కోసా సిల్క్ చీరలు అందుబాటులో ఉంటాయన్నారు. నేటి పడతులు విపరీతంగా ఆదరిస్తున్న లక్నో చికన్ వర్క్ శారీస్ సైతం ఇక్కడి ప్రదర్శనలో ఉంటాయన్నారు. నారాయణవనం దోతీస్, కాటన్ ప్రింటెడ్ వస్త్రాలు, ప్యాచ్ వర్క్, ఖాదీమెటిరీయల్ బెడ్ షీట్స్, వరంగల్ టవల్స్, లుంగీలు, యుపి ఉలెన్ కార్పెట్స్, హైదరబాద్ టాప్ప్, రెడిమెడ్ వస్త్రాలు లభిస్తాయన్నారు. ఈ శిల్పారామం క్రాప్ట్ మేళాను మూడవ తేదీ సాయంత్రం 5.30 గంటలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రారంభిస్తారని, విజయవాడ వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జయరాజ్ వివరించారు.