Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ రాజధాని అంటే ఏంటి? ఎక్కడో చెప్పాలి: ఎంపీ రఘరామ

Advertiesment
ysrcp
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 23 నవంబరు 2021 (18:50 IST)
పది రోజుల్లో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని గ్రహించిన సీఎం జగన్‌ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దేశ రాజ‌ధాని దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రైతుల మహాపాద యాత్ర కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
 
 
''సీఆర్డీఏలో రాజ్‌భవన్‌, సచివాలయం, హైకోర్టు ఉంటాయని గతంలోనే అగ్రిమెంట్‌ చేశారు. అయినా, మూడు రాజధానుల అంశంలో వెనక్కి వెళ్లేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నిన్న నేతలు దుర్బుద్ధిగా మాట్లాడారు. సీఎం జగన్‌, పెద్దిరెడ్డి, బుగ్గన, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు రికార్డుల్లో ఉన్నాయి. రాజధాని మారిస్తే రైతులకు రూ.99వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నష్ట పరిహారం చెల్లించకుండా, ఎలాంటి బిల్లు పెట్టకుండా ఉండాలంటే హైకోర్టులో కేసును కొనసాగించాల‌ని కృష్ణంరాజు చెప్పారు. 
 
2014లో జగన్‌ అమరావతిలో ఉన్న ల్యాండ్‌లో సిటీ నిర్మించడం గొప్ప అవకాశమన్నారు. అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తామని గతంలోనే చెప్పి, నిన్న అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. రూ.5లక్షల కోట్లు అవుతుందని అంటున్నారు. అందులో ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? రూ. 10వేల కోట్లు ఖర్చుపెడితే అద్భుతంగా ప్లాన్‌ చేసిన సిటీ ఏర్పాటు చేయొచ్చు. ఒక కులంపై ద్వేషంతో చేసిన వ్యవహారంతో  ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నార‌ని ఎంపీ విమ‌ర్శించారు.
 
 
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.3లక్షల కోట్లు ఖర్చు చేశామని అంటున్నారు... ఎక్కడ? దేనికి ఎంత ఖర్చు చేశారు? ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేశామా? అంటే ఏదీ లేదు. సవ్యంగా నడిచే ఇసుక పాలసీని నాశనం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు రాజధానికి సంబంధం లేదు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌ ఎక్కడ ఉంది. హైదరాబాద్‌ నిజాం హయాంలోనే మహానగరం. చెన్నై, ముంబయి బ్రిటీష్‌ కాలంలోనే మహా నగరాలు. ఏ ముఖ్యమంత్రి ఉంటే విశాఖపట్నానికి పోర్టు వచ్చింది. ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని శాసన మండలి రద్దు చేస్తామన్నారు. నెల క్రితం కిరణ్‌ రిజుజును కలిసి మండలి రద్దు విషయం వారి దృష్టికి తీసుకెళ్లారు. అధికార వికేంద్రీకరణకు, అభివృద్ధి వికేంద్రీకరణకు చాలా తేడా ఉంది. ఏపీ రాజధాని అంటే ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రికి ఎందుకింత కక్ష అని ర‌ఘురామ ప్ర‌శ్నించారు. 
 
 
రాజధాని అంటే ఏంటో సీఎం జ‌గ‌న్ చెప్పాల‌ని, అది ఎక్కడనేది కూడా చెప్పాల‌ని ఎంపీ డిమాండు చేశారు. రాయలసీమ రాజకీయాలు మానేసి, అభివృద్దిపై ఫోకస్ పెట్టాల‌న్నారు. రాష్ట్రంలో 95శాతం మున్సిపాలిటీలు గెలిచాం.. ఒక్క కొండపల్లి మున్సిపాలిటీ పోతే ఏమవుతుంద‌ని ర‌ఘ‌రామ ప్ర‌శ్నించారు.  అమ‌రావ‌తి రాజధానిని ఆపే శక్తి ఒక్క కోర్టుకు మాత్రమే ఉంద‌ని, న్యాయస్థానం న్యాయం చేయాల‌ని రఘురామకృష్ణరాజు అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కులాల వారీగా బీసీ జనగణనపై శాసనసభ తీర్మానం