Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రబాబుది కూల్చే సంస్కృతి - జగన్‌ది నిలబెట్టే నైజం : మోపిదేవి

చంద్రబాబుది కూల్చే సంస్కృతి - జగన్‌ది నిలబెట్టే నైజం : మోపిదేవి
, శనివారం, 9 జనవరి 2021 (20:06 IST)
జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన చరిత్రాత్మకమైన ప్రజా సంకల్ప యాత్ర ముగిసి రెండేళ్ళు పూర్తైన సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన పలు కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని కాంక్షిస్తూ సర్వమత ప్రార్ధనలు జరిగాయి. నాడు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగేసిన పలువురు పార్టీ నేతలను ఘనంగా సత్కరించారు. చివరగా కేక్ కట్ చేసి, వైయస్ జగన్ పాదయాత్ర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్ష నేతగా 3648 కిలో మీటర్ల పొడవున, కోట్ల మంది ప్రజలను స్పృశిస్తూ సాగిన ప్రజా సంకల్ప యాత్ర ఒక చరిత్రాత్మకమైన ఘట్టమని అన్నారు. ఆ తర్వాత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలోనే ప్రజా సంక్షేమానికి ఏపీ చిరునామాగా వైయస్ జగన్ మార్చారని తెలిపారు. దేశంలోని చాలా మంది ముఖ్యమంత్రులకు సంక్షేమ పథకాల అమలులో జగన్ రోల్‌మోడల్‌గా నిలిచారని చెప్పారు. దీనంతటికీ ప్రతిపక్షనేత హోదాలో జగన్ రాష్ట్రంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రే బీజం వేసిందని ఆయన వివరించారు.
 
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో పాదయాత్ర ద్వారానే ప్రజల కష్టాలు తెలుసుకుని అధికారంలోకి
రాగానే వాటిని పరిష్కరించారని గుర్తు చేశారు. అలానే జగన్ కూడా తండ్రిని మించిన తనయుడిగా 14 మాసాల పాటు ప్రజలతోనే మమేకమై, ఎండనకా, వాననకా, ఎన్నో కష్టాలను తట్టుకుని సుదీర్ఘ పాదయాత్ర చేశారని చెప్పారు.  
 
చంద్రబాబు నిర్వాకం ఫలితంగానే రాష్ట్రంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని మోపిదేవి అన్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేటప్పటికీ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి ఇచ్చారని, కనీసం ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి తీసుకువెళ్ళారన్నారు. ఆ కష్ట సమయంలో అధికారం చేపట్టిన జగన్ మనసుంటే మార్గముంటుందన్న రీతిలో ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలన్నీ ఏడాదిన్నరలోనే అమలు చేసి, దాదాపు రూ.90 వేల కోట్లు ప్రజా సంక్షేమానికి ఖర్చు చేసి, దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన చేస్తున్నారని ప్రశంసించారు. ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలతో పేదలకు కూడు, గూడు, గుడ్డ ఉండాలనే సత్సంకల్పంతో 31లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు పంపిణీ చేయడమే కాకుండా 15లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఒక పండుగ వాతావరణం నెలకొందని ఆయన వివరించారు.
 
పేదలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని చంద్రబాబు ఈ సమయంలో కావాలనే రాష్ట్రంలో అశాంతి, అలజడులు సృష్టిస్తున్నారని మోపిదేవి మండిపడ్డారు. “చంద్రబాబుది దేన్నైనా కూల్చే సంస్కృతి - జగన్ ది నిలబెట్టే సంస్కృతి" అని అభివర్ణించారు. తనకు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడవడం నుంచి పుష్కరాల పేరిట వందలాది గుడులను కూల్చివేత వరకు చంద్రబాబు చరిత్ర చూస్తే ఇదే తేటతెల్లమవుతుందన్నారు. ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు కూల్చేసిన గుడులను తిరిగి నిర్మిస్తున్నారని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయానికి 77 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో వసతులు ఏర్పాటు చేసుకొన్నారని వివరించారు. ఇలా కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు పట్టింపులు లేకుండా అభివృద్ధే ఆలంభనగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రికి కుల, మత రాజకీయాలు అంటగట్టడం దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. అయినా కూడా ప్రజల చల్లని దీవెనలతో జగన్ గారు పెద్ద ఎత్తున మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారని మోపిదేవి వెంకటరమణ వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో క్రమక్రమంగా భక్తుల రద్దీ