ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పంలో అధికార వైకాపా విజయభేరీ మోగించింది. ఈ స్థానం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి కేవలం 14 మాత్రమే వచ్చాయి. వైకాపాకు ఏకంగా 89 స్థానాలను దక్కించుకుంది. అలాగే, మూడో దశ ఎన్నికల్లో వైకాపా ఏకంగా 2574 గ్రామ సర్పంచ్‌లను, టీడీపీ 509 సర్పంచ్ పోస్టులను దక్కించుకుంది.
ఈ ఫలితంలపై జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఈ విజయాలన్నీ సీఎం జగన్ వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ బలపర్చిన వాళ్లే గెలిచారని, అందుకు కారణం కుప్పంలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని స్పష్టం చేశారు.
మూడో విడత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,574 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటే, టీడీపీ కేవలం 13 శాతం విజయాలకే పరిమితమైందని అన్నారు. కానీ చంద్రబాబు 36 శాతం గెలిచినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పతనం ప్రారంభమైందని చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తమ పక్షానే నిలిచారని, కుప్పంలో చంద్రబాబుకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.
కుప్పంలో 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 79 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులే నెగ్గారని వెల్లడించారు. ఏకగ్రీవాల్లోనూ తమదే హవా అని, టీడీపీకి 15.8 పంచాయతీలు ఏకగ్రీవం అయితే, తమకు 85.81 శాతం పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని వివరించారు.