ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం రాయలసీమలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అనంతపురం జిల్లాకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 10:40 గంటల నుంచి మధ్యాహ్నం 1:25 గంటల వరకు సీఎం పర్యటన కొనసాగనుంది.
ఈ పర్యటనలో భాగంగా రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామం, రాయదుర్గం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 10:55 గంటల నుంచి 11:10 గంటల వరకు 74 ఉడేగోళం గ్రామం ఉన్న వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు.
ఆ తర్వాత వేప చెట్ల మొక్కలు నాటడం, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మెంబర్లు, సిబ్బందితో సమావేశంకానున్నారు. సీహెచ్‌సీ(కస్టమ్ హైరింగ్ సెంటర్) యూనిట్లను పరిశీలించనున్నారు. అనంతరం మార్కెట్ యార్డులో ఉదయం 11:20 గంటల నుంచి 11:35 గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ని ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
11:45 నుంచి 12:05 గంటల వరకు రైతు భరోసా రథం వాహనాలను సీఎం ప్రారంభిస్తారు. తర్వాత ప్రైమరీ సెక్టార్ శాఖలకు చెందిన స్టాల్స్‌ను పరిశీలించి... పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. 12:05 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
రైతుల అనుభవాలను తెలుసుకుని వారితో మాట్లాడనున్నారు. ఆపై రైతులకు సీఎం జగన్ మెగా చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం 74 ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలం నుంచి ముఖ్యమంత్రి జగన్ 1:25 గంటలకు బయలుదేరి కడప జిల్లాలోని పులివెందులలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లనున్నారు.