15 ఏళ్ల నుండి 18 ఏళ్ళ వయస్సు వారు వెంటనే కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఇప్పటికే ప్రపంచంలో కరోనా వల్ల ఆర్ధికంగా చాలా నష్టం జరిగిందని, పూర్తి వ్యాక్సినేషన్ ద్వారానే కరోనాకు చెక్ పెట్టాలని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులు వ్యాక్సిన్ వద్దనకుండా వెంటనే వేయించుకోవాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలో 15 ఏళ్ళ వారికి కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి పెద్ది రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. తిరుపతిలోని 18వ వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరుండి విద్యార్థినీ విద్యార్థులకు టీకాలు వేయించారు. కొందరు టీకాలు వద్దని మొండికేస్తున్నారని, వారికి కూడా తప్పక టీకాలు వేయించాలని తల్లితండ్రులకు సూచించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, చిత్తూరు జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు వారు 2.10 లక్షల మంది ఉన్నారని, అందరికి కోవాక్సిన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. జిల్లాలో 1312 గ్రామ, వార్డు సచివాలయాల్లో, 141 పి.హెచ్.సి లలో వ్యాక్సినేషన్ అందిస్తున్నామని, మొత్తం 1453 కేంద్రాల్లో కి వెళ్ళి ఆ వయస్సు వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. ఓమిక్రాన్ నేపథ్యంలో విద్యార్థులందరు ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసిన జిల్లా వైద్యాధికారులని అభినందిస్తున్నాని మంత్రి పెద్ది రెడ్డి చెప్పారు.