ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విజయవాడలో దారుణం జరిగింది. ప్రేమించేందుకు నిరాకరించిందన్న అక్కసుతో యువతిని ఓ కిరాతకుడు సజీవ దహనం చేశాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది.
స్థానికంగా కలకలం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఓ ఉన్మాది యువతిపై పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మంటలు అంటుకోవడంతో యువకుడు కూడా గాయపడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని కొవిడ్ కేర్ కేంద్రంలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆసుపత్రి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది.
రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురానికి చెందిన నాగభూషణం గత కొంతకాలంగా ప్రేమ పేరుతో చిన్నారిని వేధిస్తున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో నాలుగు రోజుల క్రితం చిన్నారి గవర్నర్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిని పిలిపించిన పోలీసులు అతడిని హెచ్చరించారు. ఇకపై ఆమెను వేధించబోనని రాసివ్వడంతో యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది.
పోలీసులు హెచ్చరించినప్పటికీ తీరు మార్చుకోని నాగభూషణం.. సోమవారం రాత్రి విధులు ముగించుకున్న అనంతరం యువతి ఒంటరిగా నడుచుకుని తన గదికి వెళ్తుండగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు వెంట తెచ్చుకున్న పెట్రోలును ఆమెపై పోసి నిప్పంటించాడు.
ఈ క్రమంలో అతడికి కూడా మంటలంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నిందితుడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. తర్వాత మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.