ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఆయన ప్రయాణిస్తుండగా వైసీపీ కార్యకర్త కారును ఆపాడు. తెలుగుదేశం పార్టీ నాయకురాలు అశ్వర్థారెడ్డి కుమార్తె వివాహానికి నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.
అనంతరం తిరిగి వస్తుండగా బాలకృష్ణ కారును వైసీపీ కార్యకర్త మధు అడ్డుకున్నాడు. చేతిలో ప్లకార్డుతో వాహనాన్ని అడ్డుకోబోయాడు. ప్లకార్డును కారుపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వైసీసీ కార్యకర్త మధును అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ప్లకార్డు కర్ర ఈఎస్‌ఐకి తగిలింది. పోలీసులు మధును పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు. అనంతరం బాలకృష్ణ కాన్వాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
మరోవైపు హిందూపురం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అశ్వర్థారెడ్డి కుమార్తె వివాహానికి బాలకృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి బీకే పార్థసారథి కూడా హాజరయ్యారు.