రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వైసీపీలో చేరానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ తెలియజేసారు. విజయ్ సాయిరెడ్డి షర్మిలను ఎందుకు కలిశారో తనకు తెలియదని చెప్పారు. భవిష్యత్తులో షర్మిల- జగన్ కలుస్తారో లేదో తను చెప్పలేననీ, కానీ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చంటూ వెల్లడించారు. రాష్ట్రంలో మెడికల్ సీట్లు తమకు వద్దంటూ కూటమి ప్రభుత్వం లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం నాడు చేరారు. వైకాపా అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా శైలజానాథ్ గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశారు. 2022లో ఏపీసీసీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.