Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిద్రలో సైతం మనం పలికేదే మాతృభాష : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

నిద్రలో సైతం మనం పలికేదే మాతృభాష : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
, ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (13:06 IST)
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. బాధ కలిగినప్పుడు నిద్రలో సైతం మనం పలికేదే మాతృభాష అని, నువ్వు ఎవరు అని రేపటి తరాలు అడిగే ప్రశ్నకు సమాధానమే అమ్మభాష అని వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. భాష కేవలం మాట్లాడుకోవడం కోసమే కాదని, మన గతమేంటో, మనం ఎక్కణ్నుంచి వచ్చామో, మన సంస్కృతి ఏమిటో తెలుసుకోవడానికి కూడా అని ఆయ‌న చెప్పారు.
 
'మన తెలుగు కుటుంబాలు ముందుగా తెలుగును తమ ఇంటా వంటా అలవర్చుకోవాలి. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి. తమ పిల్లలకు  తెలియజేయాలి. తెలుగు కళలు,సాహిత్యం గొప్పతనాన్ని వారికి వివరించాలి' అని వెంకయ్య నాయుడు చెప్పారు.
 
'అవసరానికి అన్ని భాషలు నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను కాపాడుకునేందుకు అందరూ కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మన పునాదులు మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఒక మహత్తర భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడానికి మించిన గర్వకారణం ఏముంటుంది. 
 
ఎందుకంటే భాష మన సంస్కృతికి జీవనాడి. ఉన్నతమైన సంస్కృతి... ఉన్నతమైన సమాజానికి బాటలు వేస్తుంది. భాష ద్వారా సంస్కృతి, సంస్కృతి ద్వారా సమాజం శక్తిమంతమవుతాయి' అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
 
'మాతృభాష పట్ల మమకారం, అంకిత భావం లేకపోతే,  ప్రాణప్రదంగా భావించలేకపోతే భాషను కాపాడుకోలేము. ఈ విషయంలో ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది' అని ఆయ‌న చెప్పారు.
 
దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్పందిస్తూ... 'మాతృభాష అంటేనే మన ఉనికి, మన అస్తిత్వానికి ప్రతీక. మన సంస్కృతి, సంప్రదాయాలకు, జీవన విధానానికి మూలాధారం మాతృభాష. తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత' అని  ట్వీట్‌ చేశారు.
 
ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్లు చేశారు. 'ప్రతి ఒక్కరికీ పుడుతూనే దక్కే వారసత్వ సంపద మాతృభాష. శ్రీ కృష్ణ దేవరాయల వంటి స్వదేశీయుల నుండి సి.పి.బ్రౌన్ వంటి విదేశీయులను కూడా ఆకర్షించిన తెలుగు భాష, వైసీపీ పాలకుల దృష్టిలో చులకనవడం దురదృష్టకరం' అని చంద్ర‌బాబు నాయుడు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటర్లు బీజేపీకి పట్టంగడుతారు : కేంద్ర హోం మంత్రి అమిత్ షా