Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏలూరు అంతుచిక్కని వ్యాధికి కారణం కూరగాయలే!

ఏలూరు అంతుచిక్కని వ్యాధికి కారణం కూరగాయలే!
, గురువారం, 7 జనవరి 2021 (11:17 IST)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఏలూరు అంతుచిక్కని వ్యాధి ఘటన రహస్యం ఎట్టకేలకు తేలింది. కలకలం రేపిన వింత వ్యాధికి కూరగాయలే కారణంగా నిర్ధారణ అయ్యింది. మంచినీటిలో కొన్ని కలుషితాలు ఉన్నప్పటికీ అస్వస్థతకు అది కారణం కాదని, కూరగాయలు కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని నిపుణుల కమిటీ పేర్కొంది.
 
నిషేధిత రసాయనాలు పొల్లాలోకి చేరకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని, ఉభయ గోదావరి జిల్లాల్లో నీటి నమూనాలను తరచూ పరీక్షించాలని ప్రతిపాదించింది. అలాగే, కార్లు, ఇతర వాహనాలను సర్వీసింగ్ చేసిన నీరు ఏలూరు కాలువలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి, గుంటూరు, విశాఖపట్టణంలో ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని, ఆహారం, నీటి నమూనాల్లో ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లు ఉన్నాయేమో చూడాలని పేర్కొంది.
 
జనం ఉన్నట్టుండి ఆసుపత్రి పాలు కావడానికి ఇన్ఫెక్షన్లు కారణం కాదని, అదే నిజమైతే బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదని నిపుణుల కమిటీ పేర్కొంది. రక్త పరీక్షల ఫలితాలు కూడా అసాధారణంగా ఉండేవని తెలిపింది. పురుగు మందుల్లోని ఆర్గానో ఫాస్ఫేట్లు, ఆర్గానో క్లోరైడ్లలో ఏదో ఒకదాని వల్ల ఈ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని కమిటీ అభిప్రాయపడింది.
 
బాధితుల రక్త నమూనాలతోపాటు, నీటి నమూనాల్లోనూ ఆర్గానో ఫాస్ఫేట్లు కనిపించాయని తెలిపింది. ఒకవేళ నిజంగానే ఆర్గానో ఫాస్ఫేట్ ఇందుకు కారణమైతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని, దగ్గు, ఆయాసం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపించేవని పేర్కొంది. బాధితుల్లో ఆ లక్షణాలు లేవు కాబట్టి ఈ ఘటనకు ఆర్గానో ఫాస్ఫేట్లు కూడా కారణం కాదని స్పష్టం చేసింది.
 
బాధితుల ఇళ్ల నుంచి సేకరించిన టమాటా, వంకాయలలో ‘మెట్రిబుజిన్’ అనే రసాయనాన్ని గుర్తించామని, సమస్యకు ఇదే కారణం అయి ఉండొచ్చని కమిటీ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే, మెట్రిబుజిన్‌ను ఇక్కడ రైతులు చాలా తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు నగర పాలక సంస్థ పరిధిలోని తాగునీటి సరఫరా వ్యవస్థను కొన్ని నెలలపాటు అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే ఓ అభిప్రాయానికి రావాలని నిపుణులు పేర్కొన్నారు.
 
ఈ సమస్యకు ఆర్గానో క్లోరైడ్ కారణమని కమిటీ అంతిమంగా ఓ నిర్ణయానికి వచ్చింది. వ్యాధి లక్షణాలు, కోలుకోవడాన్ని బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొంది. శరీరంలో చేరిన 24 గంటల తర్వాత పరీక్షిస్తే ఆర్గానో క్లోరైడ్ ప్రభావం కనిపించదని, అందుకే బాధితుల రక్తనమూనాల్లో అది లేదని వివరించింది.

బాధితుల్లో చాలామంది రెండుమూడు రోజులుగా మాంసాహారం తీసుకోలేదు కాబట్టి కూరగాయల ద్వారానే అది శరీరంలోకి చేరి ఉంటుందని నిపుణల కమిటీ అభిప్రాయపడింది. గత నెల 4 నుంచి 12 వరకు 622మందికి వింత వ్యాధి సోకగా...పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామతీర్థంలో సొమ్మసిల్లి పడిపోయిన బీజేపీ నేతలు.. తీవ్ర ఉద్రిక్తత