Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ నిర్లక్ష్యం వల్లే ఏలూరులో ఈ దుస్థితి: చంద్రబాబు ధ్వజం

Advertiesment
జగన్ నిర్లక్ష్యం వల్లే ఏలూరులో ఈ దుస్థితి: చంద్రబాబు ధ్వజం
, సోమవారం, 7 డిశెంబరు 2020 (23:15 IST)
రాష్ట్రంలో పౌర సదుపాయాలను వైసిపి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని, జగన్మోహన్ రెడ్డి అహంభావం, నిర్లక్ష్యం వల్లే ఏలూరులో ఈ దుస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ...
 
"ఏలూరులో జరిగిన సంఘటన వైసిపి ప్రభుత్వ చేతగానితనాన్ని మరోసారి బైటపెట్టింది.  ప్రభుత్వం అనేది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉండాలి తప్ప, ప్రజల ప్రాణాలు గాల్లో కలిపేయడానికి కాదు. వైసిపి వచ్చాక ప్రజారోగాన్ని గాలికి వదిలేయడం చాలా బాధనిపిస్తోంది. ఏలూరులో ఇప్పటికే 317 మంది పైన ఆసుపత్రులలో ఉన్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఇందులో 12 ఏళ్ల లోపు వారు 40 మంది పైనే ఉన్నారు.

 
అప్పటిదాకా బాగానే ఉన్నవాళ్లు ఉన్నట్టుండి పడిపోవడం, నోట్లో నుంచి నురగ రావడం, ఫిట్స్ .. స్కూటర్ లో పోతూపోతూ పడిపోవడం, దేవాలయానికి వెళ్లినవాళ్లు అక్కడికక్కడే పడిపోవడం, రాష్ట్రంలో ఎన్నడూ ఊహించని పరిణామాలు.. వీటన్నింటినీ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. 

ఏలూరు దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతుంటే, ఇవన్నీ ఎందుకు జరిగాయనేది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ప్రభుత్వం అనేది వ్యవస్థలను పర్యవేక్షిస్తూ, వాటిని సక్రమంగా నడపాల్సిన బాధ్యత ఉంది. ఏలూరు సంఘటనలను పరిశీలిస్తే, తాగునీరు, పారిశుద్యం తదితర పౌర సదుపాయాలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందనేది స్పష్టంగా తెలుస్తోంది.

తాగేనీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, పరీక్షలు చేయాల్సివుంది. పరిసరాలు పరిశ్రుభ్రంగా ఉంచడం, డ్రైనేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం, మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు లీక్ అయి కలిసి పోకుండా చూడటం, ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంక్ లను శుభ్రపర్చడం, క్లోరినేషన్, బ్లీచింగ్ చేయించడం అన్నీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. 

వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నింటినీ గాలికి వదిలేశారు. కరోనా సమయంలో గుంటూరులో బ్లీచింగ్  పౌడర్ పేరుతో పనికిరాని సుద్ద, సున్నం చల్లి, అదే బ్లీచింగ్ గా మోసం చేశారు. ప్రజారోగ్యం పట్ల వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం దీనినిబట్టే అర్థమవుతోంది. 

ఏలూరులో జరిగిన దుర్ఘటనల వెనుక  అనేక అనుమానాలు ఉన్నాయి. తాగే నీరైనా సరిగా లేకుండా ఉండాలి, లేదా పరిశుభ్రత పాటించకుండా అయినా ఉండాలి. ఏం జరిగింది అనేది పరీక్షల ద్వారా గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సీరియస్ నెస్ ఉండాలి. రాష్ట్రంలో అవగాహన లేని ముఖ్యమంత్రి, బాధ్యతారాహిత్యంగా ఉండే ముఖ్యమంత్రి ఉన్నారు. వ్యవస్థలను కాపాడుకోవాలనే ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
 
 క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలోనూ రైతులను దారుణంగా మోసం చేశారు, డబ్బులు కట్టకుండానే కట్టామని చెప్పారు. అసెంబ్లీలో మేం పెద్ద గొడవ చేస్తే రాత్రికి రాత్రి నిధులు విడుదల చేశారు. ఆ నిధులు రైతులకు ఇప్పటికైనా ఇస్తారా, లేదా అనేది తెలియదు..రాష్ట్రంలో క్రాప్ ఇన్సూరెన్స్ వ్యవస్థను నాశనం చేశారు.. ప్రీమియం కేంద్ర వాటా, రాష్ట్ర వాటా, రైతు వాటా ఉండాలని ఇన్సూరెన్స్ లో వ్యవస్థలో స్పష్టంగా ఉంటే దానినీ నాశనం చేశారు. రైతు ఖాతాలో రూపాయి అయినా చెల్లించాలని కేంద్రం కూడా చెప్పినా బేఖాతరు చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలో 33 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా నష్టపోయాయి. రూ 7,500 కోట్ల పెట్టుబడులను రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనా. దీనిపై ఇంతవరకు అతీగతీ లేదు.  ఆదుకునేవారు లేక దిక్కుతోచని పరిస్థితిలో రైతులు ఉన్నారు. 

ఏలూరులో మొదట్లోనే ఐదారు రోజుల క్రితమే ఇలాంటి కేసులు అరకొరగా ముందే వచ్చినా పట్టించుకోలేదు. మొన్నటి నుంచి పెద్దఎత్తున ప్రజలు ఉన్నట్టుండి విరుచుకు పడిపోవడం, ఫిట్స్ రావడం పెరిగిపోయాయి. ప్రజారోగ్యంలో ఇవన్నీ తీవ్ర పరిణామాలు. ఈ సమయంలో ముఖ్యమంత్రి అనేవాడు  ఒక నాయకత్వాన్ని ఇవ్వాలి. ఏదో మంత్రులతో ఒక మీటింగ్ పెట్టి, పైపైన తిరిగితే కాదు, బాధ్యతగా ఉండాలి.

ఏలూరులో ఏం జరిగిందనేది అంచనా వేయాలి. రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత మెరుగుపర్చాలి. ఏ సంక్షోభం ఎదురైనా నేను మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసి సరైన చర్యలు తీసుకునేవాళ్లం. ఇప్పుడీ ముఖ్యమంత్రి ఏదో పెళ్లికి వెళుతూ, ఒకసారి వచ్చి పలకరించి, రివ్యూ చేసినట్లు చేసి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఇదేనా ప్రజల పట్ల ముఖ్యమంత్రికి ఉండాల్సిన బాధ్యత..? 

క్షేత్రస్థాయికి వెళితే, పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. ప్రభుత్వం సరఫరా చేసే నీరు స్వచ్ఛంగా ఉందా, కలుషితంగా ఉందా, పరిశుభ్రత ఉందా లేదా అనేది చూడాలి. ‘‘అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకొచ్చిందో మాకు తెలియదని’’ వితండవాదన చేయడం సరికాదు. సమస్య లోతుల్లోకి  వెళ్లకుండా పైపైన తిరిగితే మీకు అవగాహన రాదు. ఇలాంటి ముఖ్యమంత్రి, మంత్రులు రావడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. మీకు ఓట్లు వేయించుకున్న తర్వాత, వారి ప్రాణాలంటే కూడా మీరు లెక్కచేయని పరిస్థితికి వచ్చారు.

నిన్ననే ఏలూరులో ఒకరు చనిపోయారు. ఇన్ని వందల మంది ఆసుపత్రులలో చేరారు. ప్రజలందరూ భయబ్రాంతులయ్యారు. సరైన ట్రీట్ మెంట్ కూడా లేదు. మీరు వాడే బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ నాణ్యమైనదేనా...? నీటిలో వాటిని సరిగ్గా కలిపారా..? 

గతంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. మేం క్లోరినేషన్ ఫర్ ఫెక్ట్ గా చేశాం. స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత. చేతగాని ప్రభుత్వం వల్ల ప్రజలు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి. ఇంత పెద్ద దుర్ఘటన జరిగితే, ముఖ్యమంత్రి అక్కడే ఉండాలి. పెళ్లిళ్లు తర్వాత చూసుకోవచ్చు, ఇంటికి తర్వాత వెళ్లవచ్చు. ఘటన జరిగిన ప్రాంతాలను సందర్శించి, పరిసరాలను పరిశీలించాలి, అధికారులకు సరైన సూచనలివ్వాలి.

ఆరోగ్యశాఖ మంత్రి నియోజకవర్గంలోనే ప్రజారోగ్యం ఇంత పెద్దఎత్తున దెబ్బతింటే, ఇంక ఏం చేయాలి..? ఆడబిడ్డ సెల్ఫీ వీడియోతో నైనా ఆరోగ్య మంత్రికి కనువిప్పు కలిగిందా..?  ఏలూరు దుర్ఘటనకు వైసిపి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. టీడీపీపై దాడే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రూ 23 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ కోసం మేం కృషి చేశాం. వైసీపీ నాయకులు రూ.45వేల కోట్లకు పెంచుకుని ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారే తప్ప దానిని పూర్తిచేసే ఆలోచనలే లేవు.

ఉద్దానంలో, కనిగిరిలో మేము తెచ్చిన ప్లాంట్లను కూడా నాశనం చేశారు.  ఇప్పటికైనా ప్రజలు ఆలోచించుకోవాలి. తగిన, మామూలు జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. వైసిపి నాయకుల నిర్లక్ష్యాన్ని, అహంభావాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 

ఏలూరు ప్రజలకు నమ్మకం కలిగించడంలో వైసిపి నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి. బ్లీచింగ్, క్లోరినేషన్, నీరు, మిగిలిన పరిశుభ్రతను అనలైజ్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
 
ప్రజల ఆరోగ్యం దెబ్బతినేది సరైన తాగునీరు, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే. దోమలపై మేం యుద్ధం ప్రకటిస్తే ఎగతాళి చేసిన వైసిపి నాయకులు, ఇప్పుడు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ఏవిధంగా తప్పుడు పనులు చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారు. 

పన్నుల పెంపు మీద ఉండే ధ్యాస ప్రజారోగ్యంపై లేదు. డ్రైనేజీపై కూడా సెస్ వేస్తున్నారు. కాలిబాటపై, వాహనాలపై పన్నులు వేస్తున్నారు. ప్రతిదానిపై పన్నులు వేస్తున్నారు. ఎలా అవినీతికి పాల్పడాలి, ఏయే పన్నులు వేయాలి, సొంత మనుషులకు ఎలా దోచిపెట్టాలనే ఆలోచనలే..

ప్రతి సంవత్సరం పన్నులు పెంచడానికే ఏపీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుచేస్తున్నారు. వైకాపా ప్రతీ దానిపై పన్నులు పెంచుతూపోతోంది.  ఏపీ డెవలఫ్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి ఈ పన్నులను దానికి అనుసంధానం చేసి మరిన్ని అప్పులు తెచ్చుకోవాలని చూస్తున్నారు. 

అప్పులు చేయడంలో ఉండే శ్రధ్ధ, ఆస్థులు అమ్మడంలో ఉండే శ్రధ్ధ ప్రజారోగ్యంపై, పరిపాలనపై లేకపోవడం చాలా దుర్మార్గం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. మునిసిఫల్ మంత్రి, ఆరోగ్యశాఖా మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు..? ఎక్కడికి పోయారు వీరంతా..?  పెత్తనం చేయడానికే వీళ్లు ఉన్నారన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలపైన, ప్రతిపక్షాలపైన దాడులు చేయడానికే వీళ్లు ఉన్నారా..?

ప్రాధమిక అంచనాల ప్రకారం సమస్య ఎక్కడ జరిగిందో ప్రభుత్వం చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తికి వీటిపై అవగాహన ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి వీటిపై అవగాహన గానీ, తెలుసుకోవాలనే ధ్యాస గానీ లేదు. దీనికి తోడు జగన్ కు  అహంభావం ఎక్కువ. అతని అహంభావం, నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.
 
రాష్ట్రంలో పనిచేసే పారిశుద్య కార్మికులకు కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. కోవిడ్ సమయంలో పనిచేసిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేదు. ఏలూరు శానిటేషన్ వర్కర్లను అడిగితే తెలుస్తుంది. శానిటేషన్ వర్కర్ల విషయంలో కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన వైఖరి కాదు.

ఏలూరు సంఘటన ఒక ముఖ్యమైన సంఘటనగా ప్రభుత్వానికి కనపడలేదా? పరిశుభ్రతపై ఎందుకు పర్యవేక్షణ చేయడంలేదు.. ? దీనికి ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సంఘటన జరిగిన తర్వాత ప్రివెంటివ్ మెడిసిన్ గానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ గానీ అక్కడకు వస్తాయి. ఏలూరు పట్టణంలో వెంటనే పారిశుద్ధ్య పర్యవేక్షణ చేయాలనే భాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? వాటర్ ను చెక్ చేసి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి అన్నిశాఖలను  అక్కడ మొహరించి యుద్దప్రాతిపదికన అందరి చేత పనిచేయించాలి. 

వైకాపా వాళ్లు ఏం చేయకపోయినా, సిస్ఠంను నాశనం చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేది కాదు. రిపోర్టులు వచ్చిన తర్వాత చెబుతామంటే వీళ్లు ఉన్నది ఎందుకు? ముఖ్యమంత్రి, మంత్రులు సమస్య వచ్చిన దగ్గరే మకాం వేసి ఎందుకు పరిష్కరించరు..? వీళ్లకు పెళ్ళిళ్లు, పేరంటాలే ముఖ్యం గానీ పరిపాలన కాదు. వీళ్ల వైఫల్యం వల్లే ఇంత పెద్ద భయానక పరిస్థితి వచ్చింది. అయినా వీళ్లకు చీమకుట్టినట్టు కూడా లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేయడానికేనా ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది..? 

విశాఖలో ఎల్.జి పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఘటన జరిగినప్పుడు,  కచ్చలూరు పడవ ప్రమాదం జరిగినప్పడు ఇదే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిన్నా మొన్నా భారీవర్షాలు, వరదల్లో రైతులు నట్టేట మునిగిపోతే ఇదే విధంగా అహంభావంతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలపై యదేచ్చగా దాడులు జరుగుతున్నా అదే నిర్లక్ష్యం, అహంభావం..ఇంతకన్నా దుర్మార్గమైన పరిపాలన, చేతగాని పరిపాలన ఎక్కడా ఎప్పుడూ చూడలేదు.
 
రాష్ట్రంలో 10జిల్లాలలో మొత్తం 33 లక్షల ఎకరాలకు నష్టం జరిగింది. రూ7వేల కోట్ల పెట్టుబడి నష్టం జరిగింది నీట మునిగి దెబ్బతిన్న పంటలను చాలామంది రైతులు భరోసా కోల్పోయి దున్నేసి దుక్కి చేసేశారు. ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకోదనే బాధ, నిర్వేదం లో రైతులు ఉన్నారు. ఈ సంవత్సరం వచ్చినన్ని తుఫానులు, వరదలు ఎప్పడూ రాలేదు. దీనితో రైతు పూర్తిగా చితికిపోయాడు. కనీసం పంట భీమా అయినా ఈ ప్రభుత్వం చెల్లించి ఉంటే వాళ్లకు కొంత వరకైనా న్యాయం జరిగి ఉండేది.

మిగిలిన వాళ్లకు ఇన్ పుట్ సబ్సిడీ అయినా ఇచ్చేదానికి అవకాశం ఉండేది. వీళ్లు చేసిన పని వల్ల రైతులు అటు ఇన్సూరెన్స్, ఇటు ఇన్ పుట్ సబ్సిడి రెండూ కోల్పోయారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక్క దానికి కూడా సమాధానం చెప్పడు. ఇన్సూరెన్సు కోసం ఈ ముఖ్యమంత్రి ఒక కంపెనీ పెడుతాడట....ఈ ముఖ్యమంత్రికి అసలు జ్ఞానం ఉందా..?

గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సహాయాన్ని తీసుకుని, మనం కట్టే డబ్బు కడితే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇన్సూరెన్సు ప్రీమియం కట్టని ప్రభుత్వం ఎప్పుడూ లేదు. లోన్ లో ఒక భాగం ఇన్సూరెన్సు. ఒకప్పుడు ఎంత లోన్ తీసుకుంటే అంత ఇన్సూరెన్సు కట్టేవాళ్లు. గవర్నర్ మెంట్ ఆఫ్ ఇండియా ఫసల్ భీమా తీసుకొచ్చిన తర్వాత ఆ లోన్ కే కాకుండా అధనంగా కూడా కడుతున్నారు. ఇవ్వన్నీ ఏమీ చేయకుండా రైతుల పట్ల ఇంత దుర్మార్గానికి ఒడిగట్టారు. 

33 లక్షల మంది రైతుల గోడుకు జగనే కారణం. వాళ్ల ఉసురు జగన్ కు తగులుతుంది. ఇన్సురెన్సు కట్టాం అని ఆరోజు అసెంబ్లీలో అబద్దం చెప్పారు. చనిపోయిన తర్వాత ప్రీమియం కడతాం ఇప్పుడు ఇన్సురెన్సు ఇవ్వండి అంటే ఏ కంపెనీ అయినా ఇస్తుందా..? పంట నష్టం జరిగిపోయిన తర్వాత ఇన్సురెన్సు ప్రీమియం కడుతామంటున్న ఈ ముఖ్యమంత్రి ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి.

ఈ ముఖ్యమంత్రికి ఎదురు దాడి చేయటం తప్ప ప్రజలను ఆదుకోవడం చేతగాదు. 13 లక్షల ఎకరాలలో వరి పంట పోయింది. 10 లక్షల ఎకరాలలలో వేరుశనగ పోయింది. శనగ, పత్తి, మిరప, కంది, పొగాకు మిగతా అనేక పంటలు పోయాయి.  బాధిత ప్రజలంతా తిరుగుబాటు చేస్తే వైసిపి నాయకులు పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది.
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ బిల్లులపై మేం చాలా స్పష్టతను ఇంతకు ముందే ఇచ్చాం.

రైతులకు ఖచ్చితంగా ఎం.ఎస్.పి ఉండాలి. ఈ రోజు చెప్పాం రేపు అమలు చేయం అంటే అది కరెక్టు కాదు. అందుకే కనీస మద్దత్తు ధర చట్టపరంగా రైతుకు ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చిన దానిని అమలు చేసే వ్యవస్థ కూడా ఉండాలి. మార్కెట్ కమిటీలు యదాతదంగా ఉండి కనీస మద్దత్తు ధరతో ప్రొక్యూర్ చేసే విధంగా వ్యవస్థ ఉండాలి. ఈ రెండు విషయాలలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కూడా చేయడం జరిగింది. పొగాకు, పామాయిల్, ప్రత్తి లాంటి అనేక పంటల విషయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. ప్రభుత్వాలు భాధ్యత నుండి తప్పించుకోలేరు. స్వామినాధన్ కమిటీ రిపోర్టు కోసం మేం పోరాడాం. 

వ్యవసాయ బిల్లులపై జిల్లాలలో ఉండే తెలుగుదేశం నాయకులందరూ జిల్లా కలెక్టర్లకు మెమోరాండం ఇస్తారు. రైతుకు న్యాయం జరిగే వరకు రైతులు తరపున పోరాడుతాం. ఎంఎస్ పి పై సెప్టెంబర్ 20న ప్రధానమంత్రి నరేంద్రమోది నాడు ట్వీట్ చేశారు. ఆయన నాడు రైతులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి. రైతులకు ఎక్కడా అన్యాయం జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాల్సిన అవసరం ఉంది.

వైసిపి ప్రభుత్వం ఇకనైనా మాటలు తగ్గించి పని చేయడం మొదలు పెట్టాలి. మాస్ హిస్టీరియా అని చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. అన్ని బాగున్నాయని రిపోర్టు ఇస్తున్నారు. అన్నీ బాగుంటే మరి ఏలూరు సంఘటన ఎందుకు జరిగింది.? నూటికి నూరు శాతం ప్రైమాఫెసీ ఎవిడెన్స్ ఆధారంగా చూస్తే వీళ్లు ఇచ్చిన నీళ్లలోనే కలుషితం జరిగి ఉండి ఉండాలి. శానిటేషన్ లో కూడా లోఫం ఉండి ఉండాలి. ఏలూరులో అన్ని వయసుల వారికి వచ్చింది. చిన్న పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తోతైన పరిశోధన జరగాలి.

బ్లీచింగ్ పౌడర్ పేరుతో సున్నాన్ని చల్లి గుంటూరులోనే  రూ. 70 కోట్ల అవినీతి పాల్పడ్డారు. దీనిపై విజిలెన్సు వేశామన్నారు. రిపోర్టు ఏమైంది..? నటించడం తప్ప సీఎం జగన్ మరేమీ చేయడం లేదు. హాస్పటల్ కు వచ్చి వెళ్లిపోతే క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో ఎలా తెలుస్తుంది. క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించి ఉంటే ఏం జరిగిందో తెలిసి ఉందేది.

ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు ఏం చేస్తున్నారు? మాస్ హిస్టీరియా అని  ప్రచారం చేస్తున్నారు, వాళ్లకు కాదు పట్టింది, వైసిపికి పట్టింది దయ్యం..పన్నుల మీద ఉండే శ్రద్ద ప్రజల ప్రాణాలపై లేదు. ప్రజారోగ్యానికి ట్రస్టీలు గా ఉండాల్సిన ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుర్ఘటనలు మరెక్కడా పునరావృతం కాకుండా చూడాలని, ఏలూరు దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, రాష్ట్రవ్యాప్తంగా తాగునీరు, పారిశుద్యం మెరుగుపర్చే చర్యలు చేపట్టాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పిసిసి కొత్త అధ్యక్షుడు ఎవరు?