తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనం చేయించింది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తలు ధన్యవాదాలు తెలిపారు.
సీఎం, టీటీడీ చైర్మన్ అదేశాల ప్రకారం మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. గురువారం సాయంత్రం సీఎం చంద్రబాబు క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తామని ప్రకటన చేశారు. ప్రకటన చేసినట్లుగానే టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడారు.. ఈ మేరకు ఇవాళ వారందరికి దర్శనం కల్పించారు.
మరోవైపు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి అభిషేక సేవ అనంతరం వేకువజామున 3.45 గంటల నుంచే టీటీడీ అధికారులు దర్శనాలకు అనుమతించారు. వేకువజామునే అనుకున్న సమయం కంటే ముందే టీటీడీ ప్రొటోకాల్ ప్రముఖులకు దర్శనం కల్పించింది.