"మూడు రాజధానులు వద్దు... అమరావతి ఒకటే ఉండాలని రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. నిర్ణయం మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఇది రైతుల సమస్య కాదు. ఐదు కోట్ల మంది సమస్య.
మృతి చెందిన రైతుల కుటుంబాలకు అండగా ఉంటాం. అతి ఉత్సాహం చూపించే పోలీసులను హెచ్చరిస్తున్నాం. ఉన్మాది పాలనలో మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మీ విలువ ఎంటి? ఖాకీ బట్టలు వేసుకున్నప్పుడు రూల్స్ పాటించాలి.
చట్టపరిధిలో పనిచేయాలి. మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. కోర్టులో.. హెచ్‌ఆర్సీలో పోరాడుతాం. అంత ఈజీగా వదిలిపెట్టం. అన్ని సంఘాలు ఏకమవుతున్నాయి’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు.
రాజధాని ప్రాంతంలో ఎవరి మొహాల్లో నవ్వు కనిపించడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాలలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా గుండెపోటుతో మృతి చెందిన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు.
రైతులు, రైతు కూలీలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వ దుర్మార్గ చర్యల వల్లే ముగ్గురు రైతులు చనిపోయారని తెలిపారు. రైతుల కుటుంబాలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకోవడం సరికాదని తప్పుబట్టారు.
రైతులు అధైర్యపడవద్దని, పోరాడి సాధించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం రాజధాని ఇక్కడే ఉండాలని, మూడు రాజధానులు పెట్టడానికి వీలు లేదని తేల్చిచెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతుల ఆందోళనను హేళన చేస్తున్నారని బాబు ధ్వజమెత్తారు.
ధర్నాలు, ర్యాలీలు చేయకుండా ఆంక్షలు పెట్టారని, తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ ప్లేస్‌లో ఎమ్మెల్యేలు దీక్ష చేసే పరిస్థితి వచ్చిందన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఈ పరిస్థితి చూడలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, ఉద్యమాన్ని ఎంత అణిచివేస్తే అంత రెచ్చిపోతారని చంద్రబాబు హెచ్చరించారు.