Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన మహాత్ముడు:  ఆంధ్రప్రదేశ్ గవర్నర్
, శనివారం, 2 అక్టోబరు 2021 (23:13 IST)
అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారు.

గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా "అంతర్జాతీయ అహింసా దినోత్సవం"గా జరుపుకోవటం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు. ఇరువురు నేతల జయంతి వేడుకలు శనివారం రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 

ఈ సందర్భంగా గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, న్యాయం పట్ల విశ్వాసంతో యావత్త్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచారన్నారు. అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ చేసిన కృషి చిరస్ధాయిగా నిలిచి పోతుందన్నారు.

భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప నాయకుడిని స్మరించుకోవటానికి, ఆయన కలలు కన్న భారతదేశ నిర్మాణం విషయంలో పునరంకితం కావటానికి జయంతి వేడుకలు ప్రేరణగా నిలుస్తాయన్నారు.

మహాత్మాగాంధీ శాంతియుత పౌర హక్కుల ఉద్యమాలలో భాగంగా 1930 నాటి ఉప్పు పన్నుపై దండి మార్చ్, 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ఆలంబనగా బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని విడిచి వెళ్లాలన్న వత్తిడి తీసుకురాగలిగారన్నారు. స్పూర్తి దాయకమైన గాంధీజీ ఆలోచనల ఫలితంగానే లక్షలాది మంది ప్రజలు స్వాతంత్ర్య ఉద్యమాలకు సమిధలుగా మారారన్నారు.

గాంధీజీ తన చివరి శ్వాస వరకు దేశంలో సామాజిక సమస్యల నిర్మూలనకు కృషి చేసారని, కుల వ్యవస్థ, అంటరానితనం నిర్మూలన, సమానత్వం, సామాజిక న్యాయం సాధన వంటి విషయాలలో అలుపెరగని పోరాటం చేసారని గవర్నర్ అన్నారు.

మరోవైపు లాల్ బహదూర్ శాస్త్రి 117 వ జయంతిని కూడా జరుపుకుంటున్నామని, 'జై జవాన్ జై కిసాన్' అన్న శాస్త్రిజీ నినాదం మనందరి మనస్సులలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి సామాన్యులతో అత్యంత సన్నిహితంగా మెలిగిన నేపధ్యంలో ప్రజా జీవితం దేశ ప్రజలలో చిరస్ధాయిగా నిలిచిపోయిందన్నారు.

లాల్ బహదూర్ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్ అన్నారు. 
 
పది లక్షల మొక్కల పెంపకంకు శ్రీకారం చుట్టిన గవర్నర్ 
జయంతి వేడుకలలో భాగంగా గౌరవ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. రాజ్ భవన్ ఆవరణలో తొలి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రానున్న మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మొక్కలను నాటటం ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు.  కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా, ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎకె ఫరీడా తదితరులు పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్బు కోసం సీఎం పదవినీ అమ్మేస్తారేమో?: సాకే శైలాజనాథ్