టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసేది మీకులా దొంగ ఓదార్పు యాత్ర కాదని పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ నరేంద్ర సీఎం జగన్ ని విమర్శించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసులు నారా లోకేష్ నరసరావుపేట పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ మండిపడ్డారు. రమ్య కుటుంబానికి లోకేష్, టీడీపీ అండగా ఉంటుందనే పోలీసులు టీడీపీ నేతలపై కక్షగట్టారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్ అంటే ఈ ప్రభుత్వం భయపడి పోతుందన్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్రలను, దీక్షలను ఎప్పుడు అడ్డుకోలేదని, ఆ రోజు ఇదే విధంగా మేము చేసి ఉన్నట్లయితే, మీ నాయకుడు పరిస్థితి, మీ పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించుకోవాలి అని శ్రీధర్ వైసీపీ నేతలను ప్రశ్నించారు. పోలీసు వారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కానీ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించకూడదని, ఇది సరైన విధానం కాదు అన్నారు.
లోకేష్ చేసేది దొంగ ఓదార్పు యాత్రలు కాదు. మీ చేతగాని పాలనకు బలైన తెలుగింటి ఆడపడుచుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు ఆయన వస్తున్నాడని ధూళిపాళ్ళ అన్నారు.
తండ్రి చనిపోయిన తరువాత 3 సంవత్సరాల వరకు ఆ మరణంతో సంబంధంలేని వారిని ఓదార్పు యాత్ర పేరుతో పర్యటనలు చేసిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వారేనా లోకేష్ పర్యటనను ప్రశ్నించేది? ఈ మధ్యకాలంలో ఒక ఉన్మాది చేతిలో అసువులు బాసిన అబల కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ రావడాన్ని పెద్దతప్పుగా చూపడం సరైనదేనా? అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే లోకేష్ పై ప్రజా సేవకుని స్థానంలో ఉండి ఆరోపణలు చేయడం ఏరకంగా సమంజసం? అని ప్రశ్నించారు.