వచ్చే ఎన్నికల తర్వాత వైకాపా నేతలకు తగిన స్థలం చూపిస్తామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నాయకులకు ఒక్కటే చెబుతున్నా.. మీరు తీవ్ర అసహనంలో ఉన్నారు. మీరు తిడతారని కూడా తెలుసు. మీరు ఓడిపోతున్నారనే విషయం మీకు కూడా తెలుసు. మీ ఎక్స్‌పైరీ డేట్ సమీపించింది. అందుకేనేమో... ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరిపడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లేదు. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది.
కేసులు పెడితే భయపడిపోతాననో, రౌడీయిజం చేస్తే భయపడతాననో, ఓట్లను తారుమారు చేయొచ్చనో అనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. దొంగ ఓట్లను చేర్చేవారికి చెబుతున్నా... ఖబడ్దార్... జాగ్రత్తగా ఉండండి. అన్నీ కంట్రోల్ చేస్తాం అని అన్నారు. నాకు కావాల్సింది ప్రజల నుంచి సహకారం. ప్రజల్లో చైతన్యం రావాల్సివుంది. ప్రజల్లో చైతన్యం కోసం భావితరాల వారి భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన పార్టీ, సంక్షేమాన్ని అందించిన పార్టీ, తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన గుర్తుచేశారు.