ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువున కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహించింది. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఇక లంక గ్రామాల్లో పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.. ఇక వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్.. బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు.
ఒక్కోకుటుంబానికి 2 వేల రూపాయల నగదు తాగునీరు, రేషన్, పశుగ్రాసం అందించాలని ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు. దీంతో వరద ప్రాంతాల్లో బాధితులకు అధికారులు వరద సాయం అందిస్తున్నారు.
అయితే, అధికారులు మాత్రం వరద సాయంగా కేవలం నాలుగంటే నాలుగు వస్తువులు ఇస్తుంది. ఈ నాలుగు వస్తువుల్లో 100 గ్రాముల కందిపప్పు, 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, 4 బంగాళాదుంపలు ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వం విమర్శల పాలవుతోంది. వరద బాధితులకు ఇదేనా సాయం అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ట్వీట్ చేశారు.