Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వత్రా ఉత్కంఠ : ఏపీ పంచాయతీ ఎన్నికలపై విచారణ... ధర్మాసనం మార్పు!

Advertiesment
సర్వత్రా ఉత్కంఠ : ఏపీ పంచాయతీ ఎన్నికలపై విచారణ... ధర్మాసనం మార్పు!
, ఆదివారం, 24 జనవరి 2021 (18:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల పంచాయతీపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపనుంది. అయితే, విచారణకు మరికొన్ని గంటలే సమయం ఉన్న తరుణంలో ఈ పిటిషన్‌పై విచారణ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. దీంతో ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
 
ఏపీలో ఏపీ పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. 
 
అయితే, ఈ పిటిషన్‌ను తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం విచారిస్తుందని నిర్ణయించినా, అందులో మార్పు చోటుచేసుకుంది. ఇప్పుడా పిటిషన్ విచారణ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ రిషికేశ్ రాయ్ ధర్మాసనానికి బదిలీ అయింది.
 
సుప్రీంకోర్టులో రేపు విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వ పిటిషన్ తో పాటు ఉద్యోగ సంఘాల పిటిషన్లు కూడా ఉన్నాయి. గతంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆఫీసులో పనిచేసిన న్యాయవాది శ్రీధర్ రెడ్డి ఉద్యోగ సంఘాల తరపున వాదించడానికిగాను పిటిషన్ వేసినందువలన "నాట్ బిఫోర్ మి" సంప్రదాయం ప్రకారం.. విచారణ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనానికి బదిలీ అయింది.
 
కాగా, ఏపీలో ఎన్నికలు వద్దంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ పంచాయతీ ఎన్నికలు జరపాలని ఆదేశించింది. ఈ తీర్పుపై రాష్ట్ర సర్కారు సుప్రీంకు వెళ్లగా, ఎస్ఈసీ అంతకుముందే కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంలో రేపటి విచారణ ఆసక్తికరంగా ఉండనుంది.
 
ఇదిలావుండగా, కరోనా వ్యాక్సిన్ తీసుకునే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని ఉద్యోగ సంఘాలు స్ప‌ష్టం చేసిన నేప‌థ్యంలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అంశం క్లిష్టంగా మారింది. దీనిపై ఏపీ మాజీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. ఉద్యోగ సంఘాల తీరు స‌రికాద‌ని చెప్పారు.
 
'ఉద్యోగ సంఘాలు ఎన్నికల అంశాన్ని రాజ్యాంగం ప్రకారం నిర్ణయించడానికి ఏర్పడిన సంస్థలకు వదిలివేస్తే బాగుంటుంది. రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు చేయటం మంచి సాంప్రదాయం కాదు' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మగడ్డను బెదిరించలేదు : వెంకటరామిరెడ్డి వివరణ