Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరాతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీంకోర్టు కీలక రూలింగ్

Advertiesment
అమరాతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీంకోర్టు కీలక రూలింగ్
, సోమవారం, 19 జులై 2021 (18:48 IST)
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన, సేకరించిన భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ సీఎం జగన్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వం, ప్రతివాదులు ప్రస్తావించిన వాదనలను విన్న అత్యున్నత న్యాయస్థానం.. త్వరలో లిఖిత పూర్వక ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్‌, మెహఫూజ్‌.. ప్రతివాదుల తరఫున పరాస్, శ్యామ్‌, సిద్ధార్థ తమ వాదనలను కోర్టుకు వినిపించారు.
 
ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టవచ్చని, ప్రాథమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని వివరించారు. 
 
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందినట్లు కోర్టుకు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని, అలాంటప్పుడు ఈ అంశంపై విచారణ చేయాల్సి న అవసరమేంటని న్యాయవాది ఖుర్షీద్ కోర్టును అడిగారు. 
 
ఈ కేసులో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదన్నారు. రాజధాని ఏర్పాటు బహిరంగంగానే జరిగిందని, ఆరేళ్ల తర్వాత భూములు అమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 
 
అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటే ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. రాజధాని భూముల అంశంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు. 
 
రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని తెలిపారు. సుప్రీం తీర్పుతోనైనా రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని హితవు పలికారు. సీఎం తీరు మార్చుకోకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్న స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోరం : 30 మంది దుర్మరణం