Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలొద్దు.. ఏపీ సర్కారుకు సుప్రీం వార్నింగ్!

Advertiesment
Nimmagadda Ramesh Kumar
, గురువారం, 11 జూన్ 2020 (07:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి హెచ్చరిక చేసింది. రాజ్యాంగ సంస్థలతో ఆటలొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. పైగా, రాష్ట్ర ఎన్నికల అధికారి నియామకం కోసం తెచ్చిన ఆర్డినెన్స్ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. పైగా, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారితో ఆటలు వద్దంటూ హెచ్చరించింది. 
 
అంతేకాకుండా, ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‌రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అలాగే, హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
 
ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ వెనుక ఉన్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆర్డినెన్స్‌లు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారితో ఆటలు వద్దని చెప్పింది.
 
ఇదిలావుంటే, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించడాన్ని ఏపీ హైకోర్టు తప్పుపట్టిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ బోపన్న, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
 
రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్లు ముకుల్ రోహత్గి, రాకేశ్ ద్వివేదీ వాదనలను వినిపిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, ఎన్నికల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక వ్యవస్థలకు సంబంధించి... హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను కొట్టివేసిందని... మరోవైపు అవే నిబంధనల ప్రకారం నిమ్మగడ్డ రమేశ్‌ను పదవిలో కూర్చోబెట్టాలంటూ విరుద్ధమైన అభిప్రాయాలను వెల్లడించిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే  ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు.
 
ఈ వాదననలపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ... రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలాడటం తగదంటూ... రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ జారీ చేయడం వెనకున్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని అన్నారు. ఇలాంటి వ్యవహారాలు వ్యవస్థలకు మంచిది కాదని చెప్పారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేశారు.
 
మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని... రమేశ్ కుమార్ తరపు లాయర్ హరీశ్ సాల్వే, టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాది ఏకే గంగూలీ ధర్మాసనాన్ని కోరారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికిప్పుడే ఆదేశాలు ఇవ్వలేమని, రెండు వారాల తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆదేశాలను జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. 
 
ఈ కేసులో ప్రతివాదులు చాలా మంది ఉన్నారని, అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పింది. రెండు వారాల్లోగా ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణను కొనసాగిస్తామని చెప్పిన ధర్మాసనం... తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకేమో తిండికి తిమ్మరాజు - పనికి పోతురాజు : విజయసాయి సెటైర్లు