Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేం...

పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేం...
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 24 డిశెంబరు 2021 (17:59 IST)
పుట్టిన ఊరు, కన్నతల్లి, మాతృభాషను ఎప్పటికీ మరిచిపోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. తన ఉన్నతికి కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందని చెప్పారు.  సీజేఐ స్వగ్రామం పొన్నవరంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. పొన్నవరంతో తనకు ప్రత్యేక అనుంబంధముందన్నారు. 
 
 
పొన్నవరం, కంచికచర్లలో తన ప్రాథమిక విద్యాభ్యాసం జరిగిందని, చిన్నప్పుడు ఉపాధ్యాయులు తనను ఎంతో ప్రేమగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, పొలాలు, చెరువులు తనకు ఇంకా గుర్తున్నాయన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఐకమత్యమే ఔషధమని, తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా మనం ప్రవర్తించాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. తెలుగువారి గొప్పదనం గురించి దిల్లీలో అనేక మంది చెబుతారని, తమ రాష్ట్రాల్లోని ప్రముఖ కట్టడాలను తెలుగువాళ్లే నిర్మించారని చెప్తుంటారన్నారు. తెలుగు జాతికి సరైన గుర్తింపు లేదనే ఆవేదన తనలోనూ ఉందని.. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, చైతన్యాన్ని పటిష్ట పరుచుకోవాలన్నారు. 
 
 
కరోనా కష్టకాలంలో వ్యాక్సిన్‌ను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్రా ఎల్లా తెలుగువాళ్లు కావడం గర్వించదగ్గ విషయమని చెప్పారు.  రైతులు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని,  వారికి గిట్టుబాటు ధరలేకపోవడం, భూములకు సంబంధించిన సమస్యలూ ఉన్నాయన్నారు. తెలుగువాడిగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో తాను ఉన్నానంటే ప్రజలందరి అభిమానం, ఆశీస్సులతోనేనని, దీన్ని మర్చిపోనని చెప్పారు. ఎంత ఎదిగినా మాతృభూమిని మర్చిపోలేదన్నారు.  తెలుగు ప్రజలు గర్వపడేలా తెలుగు జాతి కీర్తిని, ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రవర్తిస్తానన్నారు. దీనికి భిన్నంగా ప్రవర్తించబోనని మాటిస్తున్నట్లు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైరల్ అవుతున్న ఎలుగుబంట్ల ఢీ వీడియో