తిరుపతిలో తనపై రాళ్ళదాడి జరిగిందంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, భూగర్భగనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని పిఎల్‌ఆర్ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే చంద్రబాబు తన పార్టీని నిలబెట్టుకునేందుకు ఈ డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఆడుతున్న నాటకంలో ఇది ఒక భాగంమని అన్నారు.
ఇంకా ఆయన ఎమన్నారంటే... తిరుపతిలో చంద్రబాబు తనపై రాళ్ళు రువ్వారంటూ రాద్దాంతం చేశారు. ఆయనపైన రాళ్ళు రువ్వాల్సిన అవసరం ఎవరికి వుంది? ఆయన గెలుస్తున్నారనే భయంతో మేం రాళ్లు వేశామా? చంద్రబాబు వైఖరి, ఆయన చేస్తున్న హడావుడి చూస్తుంటే ఇదంతా ఖచ్చితంగా డ్రామాగానే కనిపిస్తోంది.
కృష్ణాపురంఠాణా వద్ద రాళ్లు వేశారంటూ చంద్రబాబు నేరుగా సీఎం గారిపై ఆరోపణలు చేశాడు. ఆ వెంటనే ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్దమయ్యారు. ఈ సందర్బంగా తన అనుచరులతో మమ్మల్ని డౌన్‌డౌన్ అనిపించాడు. చంద్రబాబుపై రాళ్ళు రువ్వాల్సిన స్థాయిలో చిత్తూరుజిల్లా ప్రజలు లేరు. అటువంటి దిగజారిన పరిస్థితి ఈ జిల్లా వాసులకు లేదు.
తనపై రాళ్ళదాడి జరిగిందంటూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తాటతీస్తాను, తోలు తీస్తాను అంటూ చౌకబారు మాటలు మాట్లాడాడు. దానిని చంద్రబాబు అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
కృష్ణాపురం ఠాణా వద్ద ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. చంద్రబాబు తన ఉపన్యాసం పూర్తిగా ముగించే సమయంలో రాయి విసిరారంటూ డ్రామా ప్రారంభించారు. రేపు గవర్నర్ గారి అపాయింట్‌మెంట్ కోరినట్లు టీవిల్లో వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే... అసలు రాళ్లు వేశారా, వేయలేదా... వేసి వుంటే దానికి బాద్యులు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారో నిజానిజాలు నిర్ధారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.
చంద్రబాబుకు తన పార్టీ ఓటమి తెలిసిపోయింది, భయంతో పార్టీని నిలబెట్టుకోవడానికి చివరికి చంద్రబాబు ఇటువంటి డ్రామాలకు దిగజారిపోయాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపించాలి. నిజానిజాలను నిగ్గుతేల్చాలి. నిజంగా చంద్రబాబుపై ఎవరు రాయి విసిరినా వారిని శిక్షించాలి, మా పార్టీ వారు అయినా సరే మేం వారిపై కేసు నమోదు చేయాలనే డిమాండ్ చేస్తాం. అలా కాకుండా విచారణలో చంద్రబాబు అబద్దపు డ్రామాలు అడాడని నిర్దారణ జరిగితే ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలి. చచ్చిన పామును కర్రతో కొట్టాల్సిన అవసరం మాకు లేదు.
వైజాగ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా శ్రీ వైయస్ జగన్ గారిని ఆనాడు చంద్రబాబు రన్‌వే మీద కూర్చోబెట్టారు. కానీ మేం మాత్రం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ లో చంద్రబాబును ఇలా అమర్యాదగా వ్యవహరించలేదు. లాంజ్‌లో కూర్చోబెట్టి, ఆయనకు టీ, కాఫీలు కావాలంటే ఇవ్వమని అధికారులకు సూచించాం. ఇదీ మా విధానం. అమిత్ షా తిరుపతికి వస్తే ఆయనపై రాళ్ళు వేయించిన చరిత్ర చంద్రబాబుది. ఇప్పటికైనా చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓటమి భయంతో ఇటువంటి తప్పుడు డ్రామాలకు పాల్పడటం మానుకోవాలి. రాజకీయాల్లో సీనియర్‌ను అని చెప్పుకునే ఆయన ప్రజల ముందుకు ధైర్యంగా వెళ్ళాలే తప్ప ఇటువంటి గిమ్మిక్కులను మానుకోవాలి