నలుగురు చిన్నారులు ఇంట్లో నిద్రిస్తుండగా కట్లపాము కాటేసింది. అయితే ఆ విషయం పిల్లలు చెప్పకపోవడంతో దారుణం జరిగిపోయింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
ఒకే కుటుంబంలో నలుగురు చిన్నారులు పాముకాటుకు గురయ్యారు. ఒకరి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో పాలయ్యారు. ఈ ఘటన జిల్లాలోని గాలివీడు మండలం ఎగువమూల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వేణుగోపాల్ నాయుడు, ఈశ్వరమ్మలకు యువరాణి, శివకుమారి, బాలవర్ధన్‌నాయుడు, శేషాద్రి నాయుడు సంతానం.
ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నలుగురు పిల్లలు పాముకాటుకు గురయ్యారు. తెల్లవారుజాము సమయంలో వేణుగోపాల్ ఇంట్లో లైట్ వేయడంతో గుమ్మం వద్ద కట్లపాము కనిపించడంతో చంపేశాడు. అయితే పాము కరిచిందని పిల్లలు ఎవరూ చెప్పకపోవడంతో పట్టించుకోలేదు. ఉదయం ఏడు గంటల సమయంలో కొడుకు శేషాద్రి నాయుడు గొంతునొప్పిగా ఉందని చెప్పడంతో నాటువైద్యం చేయించారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
వెంటనే మిగిలిన ముగ్గరినీ రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఒకరి శరీరంలో విషం ఎక్కువ మోతాదులో ఉండడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాముకాటుకు చిన్నారి బలి కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.