Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్డుకు అడ్డంగా కారు... తీయనందుకు ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ హత్య

Advertiesment
రోడ్డుకు అడ్డంగా కారు... తీయనందుకు ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ హత్య
, ఆదివారం, 16 మే 2021 (11:38 IST)
రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును తీయనందుకు ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ దారుణ హత్యకు గురయ్యాడు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విజయలక్ష్మి నగర్‌లో శుక్రవారం రాత్రి మహేశ్వరరెడ్డి (36) అనే వ్యక్తిని చంద్రకాంత్‌ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశారు. 
 
బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన మహేశ్వర రెడ్డి తన భార్య రామేశ్వరితో కలిసి సంతోష్‌నగర్‌ వెనుకవైపు ఉన్న విజయలక్ష్మినగర్‌లో నివాసముంటున్నారు. ఈయన మానవపాడు మండలంలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. 
 
ఈయన భార్య రామేశ్వరి ఓర్వకల్లు మండలం నన్నూరులో ఆంధ్రాబ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఎస్‌.నాగప్ప వీధికి చెందిన చంద్రకాంత్‌ ఇదే కాలనీలో 15 రోజుల క్రితం ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు.
 
చంద్రకాంత్‌ తన ఇంటి ముందు రహదారికి అడ్డంగా కారును ఉంచారు. శుక్రవారం సాయంత్రం మహేశ్వరరెడ్డి విధులు ముగించుకుని మిత్రులతో కలిసి ఇంటికి వస్తుండగా.. చంద్రకాంత్‌ ఇంటి వద్ద కారు అడ్డుగా ఉండడంతో హారన్ కొట్టారు. చంద్రకాంత్‌ను పిలిచి కారును తీయమన్నారు. దీనిపై ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 
 
స్థానికులు వారిద్దరిని సర్ది చెప్పి పంపించారు. మహేశ్వరరెడ్డి రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలాజీనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి విజయలక్ష్మినగర్‌కు వస్తున్నారు. ఇదే దారిలో తన మిత్రుడు కనిపిస్తే బైకును ఆపి మాట్లాడుతున్నారు. చంద్రకాంత్‌ కారులో తన అన్న, మరి కొంతమంది మిత్రులతో కలిసి అటుగా వెళ్తూ మహేశ్వర రెడ్డిని చూశారు.
 
సాయంత్రం జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న చంద్రకాంత్‌.. మహేశ్వర రెడ్డితో మరోసారి గొడవకు దిగారు. వెంట తెచ్చుకున్న కత్తితో మహేశ్వరరెడ్డి తలపై నరికారు. మహేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి కిందపడ్డారు. స్థానికులు మహేశ్వర రెడ్డిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ శంషాబాద్ చేరుకున్న స్పుత్నిక్-వి వ్యాక్సిన్లు