Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరాఠ్వాడా మీదుగా కర్నాటక వరకు ద్రోణి.. నేడు కోస్తా రాయలసీమల్లో వర్షాలు

rain
, బుధవారం, 26 ఏప్రియల్ 2023 (11:21 IST)
మరాఠ్వాడా మీదుగా కర్నాటక వరకు అల్పపడీన ద్రోణి నెలకొనివుంది. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
మంగళవారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోతతో పాటు ఎండ తీవ్ర కొనసాగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.


2 గంటల్లో 8 సెంటీమీటర్లు..  ఎక్కడ?
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురింసింది. రెండు గంటల వ్యవధిలో ఏకంగా 8 సెంటీమీటర్ల మేరకు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా, రామచంద్రాపురంలో 7.98, గచ్చిబౌలిలో 7.75, గాజులరామారంలో 6.5, కుత్బుల్లాపూర్‌లో 5.55, జీడిమెట్లలో 5.33 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 
 
అలాగే, శేరిలింగంపల్లి, కేపీహెచ్‌బీ పరిధిలోనూ అదే మోతాదులో వర్షం కురిసింది. నడి వేసవిలో ఈ స్థాయిలో భారీ వర్షం పడటంతో ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. 2015లో ఏప్రిల్ 12వ తేదీన అత్యధికంగా 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రికార్డు తాజాగా బద్ధలైంది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో నగర వాసులు వణికిపోయారు. 
 
గాలుల వేగానికి హైదరాబాద్‌లోని పలుచోట్ల చెట్ల కొమ్మలు., హోర్డింగులు విరిగి విద్యుత్తు తీగలపై పడడంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గంటలపాటు నగరంలోని అనేక ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల ప్రాంతంలో మెట్రోజోన్‌లో 89 ఫీడర్లు ట్రిప్‌ అయ్యాయి. రాత్రి 9 గంటల సమయంలో 22 ఫీడర్లలో సరఫరాను పునరుద్ధరించగా, మిగిలినవి మరమ్మతు దశలో ఉన్నాయి. 
 
మరోవైపు వాన తీవ్రతకు ప్రధాన రహదారులపై నీరు భారీగా చేరడంతో ఆబిడ్స్‌, లక్డీకాపూల్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌ రోడ్‌ నం12, కూకట్‌పల్లి, మియాపూర్‌ మార్గాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిల్చిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌హిల్స్‌ ఓంనగర్‌లో గోడకూలి 8 నెలల చిన్నారి జీవనిక మృత్యువాత పడింది. నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పిల్లర్‌ రేకుల ఇంటిపై పడడంతో గోడకూలి చిన్నారి మరణించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఐపీఎస్‌లు కూడా..