Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సింగిల్‌గా సింహం..పందులే గుంపులుగా: వైసీపీ ఎమ్మెల్యేలకు రఘురామకృష్ణం రాజు కౌంటర్

సింగిల్‌గా సింహం..పందులే గుంపులుగా: వైసీపీ ఎమ్మెల్యేలకు రఘురామకృష్ణం రాజు కౌంటర్
, మంగళవారం, 16 జూన్ 2020 (22:01 IST)
తనపై వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలకు ఎంపీ రఘురామకృష్ణంరాజు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ‘సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయన్న చందంగా అసెంబ్లీ లాబీలో నాపై పడ్డారు’ అంటూ ధ్వజమెత్తారు.

వైసీపీలోకి వస్తానని తాను బతిమాలడం ఏంటని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గత ఏడాది రిషీ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్ కిశోర్ తనను కలిశారని, పార్టీలో చేరాలని తనకు ఎన్నో ప్రలోభాలు పెట్టారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. తనను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేశారో అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిని, రాజిరెడ్డిలను అడగాలన్నారు.

తాను ఇప్పటి వరకు జగన్ ఇంటికే వెళ్లలేదని, ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి మాత్రమే ఆయన్ను కలిశానని చెప్పుకొచ్చారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తనపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు మీడియా ముందుకు వచ్చారు.

‘ఎవరండీ వీళ్లు, ఆఫ్ట్రాల్ గాళ్లు.. ఈ జోకర్లు ఎప్పుడైనా నా గురించి జగన్‌కు చెప్పారా? జగన్‌ను అడగండి. ఆయన అబద్దం చెప్పరు. వాళ్లంతా దొంగలు, ప్రజల నుంచి డబ్బులు, చెక్కులు వసూలు చేశారు’ అని ఘాటైన పదజాలంతో రఘురామకృష్ణంరాజు విరుచుకుపడ్డారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఇసుక దొంగ, స్థలాల పేరుమీద ఇసుకను దోచేశాడని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.

‘ఎన్నిసార్లు నా కొంప చుట్టూ తిరిగావో.. దేనికోసం తిరిగావో నీకు తెలియదా’ అంటూ ఎమ్మెల్యే సత్యనారాయణను తూర్పారబట్టారు. ‘ఆ దొంగ సంగతి ఆయన మేనల్లుడిని అడిగితే వివరంగా చెబుతాడు’ అని అన్నారు. ఇక కారుమూరి నాగేశ్వరరావు గురించి చెప్పక్కర్లేదన్నారు. ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల పట్టాలకు సంబంధించి 70శాతం ఫిర్యాదు ఆయనపైనే వచ్చాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సౌమ్యుడు, నిజాయితీపరుడు అని, జగన్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని చాలా బాధపడేవాడని అన్నారు. అలాంటి వ్యక్తి తనపై ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడంలేదన్నారు. ‘ఇక మంత్రి శ్రీరంగనాధరాజు విషయానికొస్తే.. ఆయన చేసేంత అవినీతి, దుర్మార్గం ఎక్కడా లేదు’ అని ఆరోపించారు. కలెక్టర్‌కు వచ్చే ఫిర్యాదుల్లో సగం ఆయనపైనే ఉంటాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. 
 
వైసీపీలో కలకలం
నరసాపురం వైసిపి ఎంపి రఘురామకృష్ణమరాజు వ్యవహారం వైసిపిలో ముదురుతోంది. కొం కాలంగా వైసిపిపై, సిఎం జగన్‌పై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.. సిఎం జగన్‌ క్నొఇ్న సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఉన్నత పదవులు పేరు చివరన రెండు అక్షరాలతో వచ్చే ఓ వర్గం పేరు ఉన్న వారికే కట్టబెడుతున్నారని ఆయన ఇటీవల విమర్శించారు.

తాను నరసాపురం ఎంపిగా జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో పెట్టుకొని గెలవలేదని, సొంతంగా గెలిచానని కూడా అన్నారు. ఇదిలా ఉండగా, ఈయన వ్యాఖ్యలపై వైసిపి ఎమ్మెల్యేలు స్పందించారు. ఆయన వ్యవహారంపై సిఎం జగన్‌ దగ్గర ప్రస్తావించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. నరసాపురం ఎంపి రఘురామకృష్ణమరాజుకు రాజకీయ నేత లక్షణాలు లేవని అన్నారు. కొన్ని సామాజిక వర్గాలను జగన్‌ ఎగదోస్తున్నారనడం సరైంది కాదన్నారు. సిఎం జగన్‌ అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం చేస్తున్నారని అన్నారు.

రఘరామకృష్ణమరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మంత్రి రంగనాథరాజు విమర్శించారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు ఆయన వ్యవహారం ఉందన్నారు. నరసాపురంలో కరోనా నియంత్రణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

జగన్‌ ఫొటో లేకుంటే ఎంపి అయ్యేవాడివా? అని ప్రశ్నించారు. ఆయన మనసులో వేరే ఉద్దేశాలు ఏవో పెట్టుకొని మాట్లాడుతున్నారన్నారు. రఘురామకృష్ణమరాజుకు బ్యానర్‌ కట్టే క్యాడర్‌ కూడా లేదని మరో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. కేబినెట్‌లో క్షత్రియులకు కూడా జగన్‌ చోటు కల్పించారన్నారు.

మూడు పార్టీలు మారి ఆయన ఎంపి అయ్యారని తెలిపారు. ఎంపి వ్యవహార శైలిని కార్యకర్తలే తప్పు పడుతున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ అన్నారు. గతంలో రఘురామకృష్ణమరాజును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. వివాదాల కోసమే ఆయన పని చేస్తారని, వైసిపి నుంచి పోటీ చేశారు కాబట్టే ఎంపిగా గెలిచారని అన్నారు. నిత్యం ప్రజల నోళ్లలో నానేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారన్నారు.

20 రోజుల ముందు పార్టీలో చేరి ఎంపి అయిన విషయం మర్చిపోవద్దని అన్నారు. జిల్లా నేతలంతా కలిసి సిఎంను బతిమాలితేనే ఎంపి సీటిచ్చారన్నారు. సిఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ఎంపి ప్రయత్నించడం నిజం కాదా? అన్ని ఎమ్మెల్యే కారుమూరి ప్రశ్నించారు.

మరో ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ.. సిఎం జగన్‌ వేవ్‌లోనే తామంతా గెలిచామని తెలిపారు. రఘురామకృష్ణమరాజు అంత బలమైన నేత అయితే ఆయన స్వగ్రామంలో ఎంత మెజారిటీ వచ్చిందో చెప్పాలన్నారు. సొంతంగా గెలిచానని అనుకుంటుంటే వెంటనే రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులను ఏ రాజకీయ పార్టీ ఆదరించదన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిగా బాధ.. కానీ, దేశం కోసం అమరుడు కావడం సంతోషంగా వుంది...