Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లాఠీలు, ఇనుపకంచెలతో ప్రజాఉద్యమాన్ని అణచలేరు: టీడీపి

Advertiesment
లాఠీలు, ఇనుపకంచెలతో ప్రజాఉద్యమాన్ని అణచలేరు: టీడీపి
, గురువారం, 9 జనవరి 2020 (18:30 IST)
నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ ఉంటుందని గతంలో చెప్పిన  డీజీపీ, ఇప్పుడెందుకు టీడీపీ నేతలను, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని, అమరావతి పరిరక్షణసమితి జేఏసీ నేతలను, అఖిలపక్ష నాయకుల్ని అడ్డుకుంటున్నాడో సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీమంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు.

గురువారం ఆయన ఆత్మకూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిరసనతెలిపే హక్కు వైసీపీ కార్యకర్తలకు ఒకలా... ప్రజలకు మరోలా ఉంటుందని డీజీపీ భావిస్తున్నారా అని కళా నిలదీశారు. ముఖ్యమంత్రి అస్తవ్యస్త విధానాలు, అవినీతి పాలనతో విసిగివేసారే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారనే విషయాన్ని డీజీపీ తెలుసుకోవాలన్నారు.

ప్రభుత్వం చెప్పినట్లుగా పనిచేస్తున్న పోలీస్‌శాఖ, ప్రజలకున్న నిరసనతెలిపే హక్కుని కాలరాస్తోందని, ప్రజలకు ఆహక్కు ఉందో..లేదో పోలీస్‌మాన్యువ‌ల్‌లో ఉన్న విధివిధానాలేమిటో డీజీపీ స్పష్టంచేయాలన్నారు. తెనాలిలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను అరెస్ట్ చేయడం, పోలీసులు ఆయనపట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని టీడీపీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నట్లు కళా తెలిపారు.

లాఠీలు, ఇనుపకంచెలతో ప్రజాఉద్యమాన్ని అణచలేమన్న విషయాన్ని పాలకులు గ్రహించాలని ఆయన హితవుపలికారు. ఇతరులు పెట్టే సోషల్‌మీడియా పోస్టింగులపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న పోలీసులకు, వైసీపీ సోషల్‌మీడియా విభాగం పోస్టులు కనిపించడంలేదా అని కళా ప్రశ్నించారు.

ధూళిపాళ్ల అవినాశ్‌ని అర్థరాత్రి అరెస్ట్‌చేసి, మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించడం చూస్తుంటే, ఎమర్జన్సీని తలపించేలా  ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 7నెలల పాలనావైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే జగన్‌ప్రభుత్వం రాజధానిపేరుతో రాష్ట్రంలో మంటలు రేపిందన్నారు.

మరోవైపు మంత్రులు మాట్లాడేభాషను చూస్తున్న ప్రజలు, అమాత్యులను గబ్బిలాల మాదిరి చూస్తూ, సిగ్గుతో తలదించుకుంటున్నారని మాజీమంత్రి స్పష్టంచేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రాజధానిప్రాంత రైతులు, మహిళలపై తప్పుడు కేసులుపెడుతూ, టెంట్లుకూడా వేసుకోకుండా వారిని అడ్డుకోవడం రాష్ట్రప్రభుత్వ రాక్షసత్వానికి సంకేతమన్నారు.

చినకాకాని ధర్నాలో వైసీపీఎమ్మెల్యేకు దండంపెడుతూ, రైతుల వేడుకుంటున్న దృశ్యాలు చూశామని, అటువంటి రైతుల్ని తప్పుపట్టేలా అధికారపార్టీనేతను అడ్డుకున్నారన్న కారణంతో అక్రమకేసులు పెట్టడం భావ్యంకాదన్నారు. కేసులతో, కక్షసాధింపులతో ఉద్యమాన్ని అణచాలని చూస్తే, అదిమరింత ఉధృతమవుతుందనే విషయాన్ని పాలకులు   గ్రహిస్తే మంచిదని కళా హితవుపలికారు.

రాజధానిరైతులు, మహిళలు, టీడీపీనేతలు, ఇతరపార్టీల నాయకులపై పెట్టిన అక్రమకేసుల్ని ప్రభుత్వం తక్షణమే ఎత్తివేయాలని కళా డిమాండ్‌చేశారు. రాష్ట్రప్రభుత్వ నిరంకుశ విధానాలపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని, రాజ్యాంగబద్ధ పోరాటానికి కూడా సిద్ధమవుతామని ఆయన తేల్చిచెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ కు పుదుచ్చేరి మంత్రి మద్దతు.. ఎందుకో తెలుసా?