Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ తపన అంతా చంద్రబాబు కోసమే: మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్

పవన్ తపన అంతా చంద్రబాబు కోసమే: మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్
, శనివారం, 2 అక్టోబరు 2021 (22:22 IST)
చంద్రబాబు హయాంలో రోడ్లు ఎందుకు వేయలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ ఆనాడు ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ఇప్పుడు రోడ్లు వేస్తుంటే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని.. టీడీపీ ప్యాకేజీ కోసమే పవన్ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. కాకినాడలోని ఆర్‌ అండ్ బీ గెస్ట్‌ హౌస్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఏమన్నారంటే...
 
1. గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల పుట్టిన రోజున ప్రజల్ని రెచ్చగొట్టాలని.. ఏ స్థాయిలో యుద్ధం కావాలంటూ జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్ ప్రసంగించటం సరికాదని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ అన్నారు. ప్రజాస్వామ్యంలో యుద్ధాలు ఎందుకు అని పవన్‌ కళ్యాణ్‌ను మంత్రి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు కావాల్సిన ప్రభుత్వాలను ఎన్నుకుంటారు.

ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల పట్ల బాధ్యతగా పనిచేస్తుంటాయి. అవసరాలు అనేటటువంటివి నిరంతరమైన ప్రక్రియగా ఉంటాయని మంత్రి తెలిపారు.  అయితే, గాంధీ జయంతి రోజున యుద్ధవాతావరణంలో ప్రజలను తీసుకువెళ్లాలనే పవన్ ప్రయత్నాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ హర్షించరని మంత్రి అన్నారు.

రోడ్లకు శ్రమదానం చేస్తామని పవన్ కార్యక్రమం తీసుకున్నారు. కానీ, శ్రమదానం ఎలా చేయకూడదో పవన్‌ను చూసి నేర్చుకోవచ్చన్నారు. క్లాప్, కెమెరా, యాక్షన్ అన్నట్లు పవన్ వ్యవహరించారని మంత్రి అన్నారు. శ్రమదానం సందర్భంగా పారకు పనిచెప్పకుండా.. పవన్ నోటికి పని చెప్పారన్నారు. 
 
2. ప్రజాస్వామ్యంలో ఏర్పాటైన ప్రభుత్వాలపై పవన్ చేసిన విమర్శలు ఏవిధంగా ఉండాలన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి చెల్లుబోయిన అన్నారు. రోడ్లు వేయలేదని పవన్ అంటున్నారు. నిజానికి తన రాజకీయ సినిమా రోడ్లు మూసుకుపోతున్నాయనేది పవన్ భయంగా కనిపిస్తోందన్నారు. రోడ్లు ఏకాలంలో వేస్తారో పవన్‌ కళ్యాణ్‌కు తెలీదా అని మంత్రి ప్రశ్నించారు. వర్షాకాలంలో ఎక్కడైనా రోడ్లు వేస్తారా?

ఏ సీజన్‌లో రోడ్లు వేస్తారో పవన్‌ గమనించటం లేదని చెల్లుబోయిన అన్నారు. ఇప్పటికే సీఎం శ్రీ వైయస్‌ జగన్ మోహన్‌ రెడ్డి గారు రోడ్ల కోసం రూ.2,200 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారన్నారు. మరి, పవన్ మద్దతు పలికిన చంద్రబాబు ఆనాడు వేసిన రోడ్లు .. వర్షాకాలంలో ఎలాపాడైపోయాయో అందరూ చూశారు. 
 
3. భగవంతుడి దయవల్ల మూడేళ్లుగా వర్షాలు పడి రోడ్లు కొంత పాడైపోయాయి. పవన్ కళ్యాణ్‌ మాటలు వింతగా ఉన్నాయి. పవన్ పార పట్టుకొని .. కెమెరా కోసం శ్రమదానం చేసినట్టుంది తప్ప ప్రజల కోసం కాదు. రాజమండ్రి, పుట్టపర్తి అయినా నేను వచ్చాను కాబట్టి రోడ్లు వేశారు అని అంటున్నాడు. పవన్ కళ్యాణ్‌ కోసం ప్రభుత్వం రోడ్లు వేయదు. ప్రజల కోసం ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ప్రభుత్వం ఎప్పుడూ సక్రమంగా నిర్వహిస్తుందని మంత్రి చెల్లుబోయిన స్పష్టం చేశారు.  
 
4. రూ.2,200 కోట్లతో రోడ్లు వేస్తున్నారని తెల్సి పవన్ డ్రామాలు వేస్తున్నారు. పవన్ శ్రమదానం చేస్తామనగానే రోడ్లు వేస్తామని ప్రభుత్వం చెప్పలేదు. ముందుగానే సీఎం వైయస్‌ జగన్ రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రకటనను కూడా పవన్ గమనించలేదు. చంద్రబాబు, ఎల్లో మీడియా ఆలోచనా విధానికి అనుగుణంగా వెళ్లకపోతే బావుండదని పవన్‌ శ్రమదానానికి కొత్త భాష్యం చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ తీరు చూసి జనాలు నవ్వుకుంటున్నారు. 
 
5. పవన్‌ కళ్యాణ్‌  రాజకీయాల్లోకి వచ్చి పుష్కరకాలం అయినా ఎమ్మెల్యే కాలేకపోయారనే బాధ ఆయనలో ఉంది. గాంధీ జయంతి రోజున ప్రజల్ని రెచ్చగొట్టడానికి గాడ్సే వారసుడిలా మాట్లాడారు. ప్రజల కష్టాన్ని ఓదార్చే ప్రయత్నం చేయాలి తప్ప రెచ్చగొట్టడం సరికాదని పవన్‌కు మంత్రి సూచించారు. కరోనా కష్టకాలంలో ప్రతి పేదవాడు సంక్షేమ ఫలాలు ద్వారా ఎదుగుతుంటే.. పవన్ ఈ తరహా రాజకీయాలు చేయటం భావ్యం కాదని మంత్రి హితవు పలికారు. గాంధీ జయంతి రోజున ప్రజల్ని రెచ్చగొట్టి.. తగలబెట్టండి అని పవన్ మాట్లాడటం ఏంటి? 
 
6. పవన్ రాజమండ్రి వచ్చి శెట్టి బలిజలకు భరోసా ఇస్తారట. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రభుత్వం రూ. లక్ష నాలుగు వేల కోట్లు అందించింది. నేడు ప్రభుత్వం అంటే సీఎం టు కామన్ మ్యాన్. నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు చేర్చి.. అన్ని వర్గాల వారిని డీబీటీ ద్వారా పేదరికం నుంచి జగన్ బయటపడేస్తున్నారు. బీసీలు, అగ్రవర్ణాల పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. కాపుల కోసం కాపు నేస్తం కూడా అందజేస్తోంది ఈ ప్రభుత్వం. ఈరోజు పవన్‌ ఒంటరి, తెలగ, బలిజ అనే కులాల్ని ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్ని్స్తున్నారు. 
 
7. ఒక్కో సీజన్‌లో ఒక్కో రాజకీయ పార్టీతో పవన్ పొత్తులు పెట్టుకుంటారు. గతంలో టీడీపీ, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీతో ఉంటే గెలవలేం అనే భయంతో పవన్ కులాల పేరిట రాజకీయం చేస్తేనే మనుగడ అన్నట్లు ఇవాళ ప్రసంగించినట్లుంది. రోడ్లు ఈరోజు కాకపోతే రేపు బాగుపడతాయి కానీ ప్యాకేజీల కోసం ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్న పవన్‌ను నమ్మిన వారు ఏ రోజు రాజకీయాల్లో బాగుపడరు. 

ప్రజల కోసం తిట్లు తింటున్నానని పవన్ అంటున్నారు. ప్రజల చేత ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులపై పవన్ తాటతీస్తానని మాట్లాడటం ఏంటి? పైగా పవన్‌ను తిడుతున్నారని అనటం సరికాదు. పవన్ మాట్లాడితే.. ఎదుటి వారు మాట్లాడిన సందర్భంలో మీకు కలిగిన బాధే వారికి కలుగుతుందన్న స్పృహ మీకు లేదా పవన్ అని మంత్రి నిలదీశారు. నిజంగా ప్రజల కోసం పనిచేయాలనుకుంటే ఈ మాటలు మీ నోటి వెంట రావని  అన్నారు.  
 
9. వైయస్‌.వివేకానందరెడ్డి గారి హత్య, వైయస్‌ జగన్ పై దాడి విషయంలో మీ మితృత్వంలో ఉన్న బీజేపీని సీబీఐ ఎంక్వైరీ అడటం జరిగింది. మీరే కేంద్రాన్ని అడగవచ్చు కదా.  ప్రభుత్వంపై విమర్శలు చేయాలని పవన్ చేస్తున్న రాజకీయాలు ప్రజలంతా గమనిస్తున్నారు.

ప్రజాస్వామ్యంలో వర్గశత్రువులుంటారా అని  మంత్రి ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ బాధ ఒక కులం గురించి. అయితే ఈ ప్రభుత్వంలో అనేక కులాలు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. ఆ కులాల మేలును, సంక్షేమం, భద్రతని ప్రభుత్వంలోని తమవారు చూస్తారనే భరోసా ఉంది. ఇవి చూసి పవన్‌కు వణుకుపుడుతోంది. 
 
10. పవన్ తపన అంతా చంద్రబాబు కోసమే. ఇవాళ సభకు వచ్చిన జనాన్ని చూపించి 2024లో ప్యాకేజీ ఎంత పెంచుకోవాలన్నది పవన్‌ లక్ష్యమని స్పష్టంగా అర్థమైంది. బీజేపీ రాష్ట్రంలో గెలిచే పరిస్థితి లేదు. చంద్రబాబుతో ప్రయాణిస్తే కాపు సోదరులు ప్రశ్నిస్తారన్న సంగతి పవన్‌కు తెల్సు. 
 
11. పవన్ ఉండేది ఈ రాష్ట్రంలో కాదు. ప్రవాసాంధ్రుడిలా పొరుగు రాష్ట్రంలో ఉంటారు. రాష్ట్ర ప్రజలతో ఎటువంటి సంబంధాలూ, మమకారమూ లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ జనాన్ని చూపించి ప్యాకేజీ పెంచుకోవాలన్నది పవన్  కళ్యాణ్‌ ముఖ్యోద్దేశ్యమని మంత్రి అన్నారు. శ్రమదానం అనే పదానికి కొత్త అర్థాన్ని పవన్‌ తెచ్చారు.

పార పట్టుకొని కెమెరాకు ఫోజు ఇవ్వటమే శ్రమదానికి పవన్ తెచ్చిన అర్థమని మంత్రి చెల్లుబోయిన మండిపడ్డారు. ఇది పేదల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద దాడి చేయాలనుకునే శక్తులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు మనవి చేస్తున్నానని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బద్వేలు ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపం: పవన్ కళ్యాణ్