పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనాన్ని ఉపయోగించనున్నారు. ఈ వాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా ఈ వాహనంలో పర్యటించలేదు. ఇపుడు తొలిసారి ఈ వాహనంలో ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటనకు బయలుదేరి వెళ్ళనున్నారు.
ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఈ వాహనాన్ని ఆయన తన ఎన్నికల ప్రచార రథంగా ఉపయోగించనున్నారు. తన వారాహి వాహనంతో ప్రజల్లో తిరిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ వాహనంపై ఉభయగోదావరి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.
గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ చేపట్టే యాత్రపై పీఏసీ సభ్యులతో ఆ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాచ్, ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లడంపై చర్చించారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలుగకుడా ఏర్పాట్లు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యాచరణ సిద్ధం చేసిన తర్వాత పవన్ యాత్రా తేదీలను ప్రకటిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.