Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మల్లవల్లి రైతులకు అండగా ఉంటా.. ఆ రెండు పార్టీలు ముందుకు రావాలి : పవన్ కళ్యాణ్

pawan mallavalli
, ఆదివారం, 6 ఆగస్టు 2023 (17:55 IST)
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలోని మల్లవల్లి రైతులకు అండగా ఉంటామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. 2016లో పారిశ్రామికవాడ కోసం 1,460 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. సాగుదార్లకు ఎకరాకు రూ.7.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, అర్హులమైనా తమకు పరిహారం రాలేదంటూ అప్పటి నుంచి కొందరు రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామికవాడలో రైతులను పవన్‌ ఆదివారం కలిశారు. రైతుల భూములు తీసుకున్న ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'కులాలు, పార్టీ, ప్రాంతాల వారీగా రైతులను విడదీయలేం. రైతుల్లో ఐక్యత లేకుంటే అనేక సమస్యలు వస్తాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక మల్లవల్లి రైతులు సమస్యలపై దృష్టి సారిస్తాం. రైతులపై దాడి చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. పరిస్థితులకు అనుగుణంగా పనిచేసే పోలీసులను నేను తప్పు పట్టను. ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చెప్పినట్లే పోలీసులు వింటారు. మల్లవల్లి రైతులకు పరిహారం వచ్చేవరకు అండగా ఉంటాం. రైతుల ఇళ్లలోకి చోరబడితే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. 2016లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మల్లవల్లి రైతులకు టీడీపీ అండగా ఉండాలి.. బీజేపీ కూడా రైతులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 
 
పరిహారం అడిగితే పోలీసులతో కొట్టించారని రైతుల ఆవేదన చెందుతున్నారు. కొంతమంది రైతులను నడవలేని పరిస్థితికి తెచ్చారు. మరికొందరిని జైలుకు పంపి ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వ అవసరాలకు ప్రజల నుంచి భూములు తీసుకోవచ్చు. అయితే, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి. మల్లవల్లి విషయంలో రైతులకు న్యాయం జరగలేదు. పరిహారాన్ని కొందరు రైతులకే ఇచ్చారు. ఆ తర్వాత రకరకాల కారణాలతో పరిహారం ఆపేశారు అని పవన్‌ ఆరోపించారు. కాగా, ఈ సందర్భంగా పలువురు రైతులు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆరోపణలు చేశారు. .

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టెలికాస్ట్ టీవీ ప్రసారాలు