పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పరమత సహనంపై స్వామి వివేకానంద చేసిన ప్రసంగాన్ని గుర్తుచేస్తూ పవన్‌కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'పరమత సహనం అంటే మన మతాన్ని వదిలేసుకోవడం కాదన్నారు.
అలాగే సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మం అని సగర్వంగా పాటిస్తూ, మిగతా మతాలని సహనంగా చూడటం. 1893, 11 సెప్టెంబర్... స్వామి వివేకానంద చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో- మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు అని పవన్ గుర్తు చేశారు. ఇదే రోజు మనం 'ధర్మాన్ని పరిరక్షిద్దాం - మతసామరస్యాన్ని కాపాడుకుందాం' అనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నాం.
అంతా దైవ సంకల్పం. మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి.
ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది అని స్వామి వివేకానంద చెప్పారు' అంటూ పవన్‌కల్యాణ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.