వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో తాను ఇతరులకు పల్లకీ మోయనని, ప్రజలను పల్లకీలో పెట్టి మోస్తానని చెప్పారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల్లో వైకాపా ఓటమి తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం రాదు. ఆ ఎన్నికల్లో వైకాపాకి ఓట్లు అడిగే హక్కు లేదు. ఇది కొత్తతరం రాజకీయం. పాతతరం కాదు. వైకాపా వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచన చేసి చెప్పినట్టు తెలిపారు.
శ్రీలంకలా ఏపీ కారాదనే ఆ మాట అన్నాను. నా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. వ్యూహం నాకు వదిలేయండి. నేను ఎవరికీ పల్లకీ మోయను. ప్రజలను పల్లకీ ఎక్కించేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా అంటూ ఆయన ప్రకటించారు.