ఏపీ రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖామంత్రిగా ఇదే చివరి మీటింగ్ కావొచ్చని, ఆ తర్వాత రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా తనకు ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 11వ తేదీ నుంచి కొత్త మంత్రులు వస్తున్నారని చెప్పారు.
బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన "వన్ ఇండియా - వన్ బస్" అనే వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ నెల 11వ తేదీ తర్వాత కొత్త మంత్రులు రావొచ్చన్నారు. అందులోభాగంగా రవాణా మంత్రిగా ఎవరు వచ్చినా తనకు ఇబ్బంది లేదని, కొత్త రవాణా మంత్రితో తన అభిప్రాయాలను పంచుకుంటానని చెప్పారు. మూడేళ్ళపాటు మీతో కలిసి పనిచేశానని, ఇకపైనా ఏవైనా సమస్యలు ఉంటే కొత్త మంత్రి వద్దకు లేదా అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
బస్సు, లారీ ఆపరేటర్ల కష్టాలు తనకు కూడా బాగా తెలుసన్నారు. తాను కూడా ఓ సిటీ బస్సును నిర్వహించేవాడినని చెప్పారు. వన్ ఇండియా వన్ బస్ విధానం ద్వారా ముందుకు వెళ్దామని ముఖ్యమంత్రి చెప్పారని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.