పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు.
ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. వసంతవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకోగా, ఈత కొట్టేందుకు వాగులోకి వెళ్ళిన చిన్నారులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు.
భూదేవిపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వన భోజనాలు చేసేందుకు పెదవాగుకు వెళ్ళగా సరదాగా ఈత కొట్టేందుకు వాగులోకి దిగిన గొట్టుపర్తి మనోజ్(16), కోనవరపు రాధాకృష్ణ(16), కర్నాటి రంజిత్(16), శ్రీరాముల శివాజి(17), గంగాధర్ వెంకట్(17), చల్లా భువన్(18) గల్లంతయ్యారు.
గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి గల్లంతైన వారి మృతదేహాలను వెలికితీశారు. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తన సానుభూతిని ప్రకటించిన గవర్నర్ హరిచందన్, పిల్లల విషయంలో ఏమరుపాటు తగదని హితవు పలికారు.