టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటూ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులోభాగంగా, ఆయన కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు, శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
నిజానికి ఇచ్ఛాపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఒడిషా సరిహద్దుల్లో ఉంది. ఈ సెగ్మెంట్‌లో ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు జరిగితే ఐదు పర్యాయాలు తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైద్యుడు బెందాళం అశోక్ కుమార్ విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సీటును ముగ్గురు నేతలు ఆశిస్తున్నారు.
2014లో బెందాళం 20 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపొందడంతో ఈ సారి కూడా అతడికే టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తామని పార్టీ శ్రేణులు ఉన్నాయి. కళింగ సామాజిక వర్గానికి చెందిన అశోక్‌ను కాదని.... కొత్త అభ్యర్థికి సీటు కేటాయిస్తే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది.
ఇదే స్థానాన్ని రెడ్డి, యాదవ సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష ఆశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ను ఇక్కడి నుంచే పోటీ చేయించేందుకు ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నారు.