Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ బాబు మామూలు బాబు కాదంటున్న ఎంపి నందిగం సురేష్, ఇంతకీ ఏ బాబూ?

ఈ బాబు మామూలు బాబు కాదంటున్న ఎంపి నందిగం సురేష్, ఇంతకీ ఏ బాబూ?
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:59 IST)
అమరావతి అనే బినామీ ఉద్యమానికి ఇప్పుడు చంద్రబాబు కొత్తగా దళితుల రంగు వేయాలని ప్రయత్నిస్తున్నాడని బాపట్ల లోక్‌సభ సభ్యుడు శ్రీ నందిగం సురేష్ ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమం అంటూ వచ్చిన పసుపు మహిళల సామాజికవర్గం ఏమిటో అందరికీ తెలుసునని, పట్టుమని పది మంది కూడా లేని ఆ గ్రూపులో ప్రతి ఒక్కరు మిలియనీర్లు లేదంటే బాబు బినామీలు లేదంటే బాబు ఆత్మ బంధువులే అని వ్యాఖ్యానించారు. 
 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  మామూలు రోజుల్లో అమరావతి దీక్షల్లో ఒక్కరూ కనిపించరని, ధర్నాలు, 600వ రోజుల పండుగలకు మాత్రం జనాలు పోగవుతారని, ఇదంతా లేని ఉద్యమానికి హైప్‌ క్రియేట్‌ చేయడం కోసమేనని నందిగం సురేష్ అన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదని, ఇక్కడేదో జరిగిపోతుందనే కాన్సెప్ట్‌తో చంద్రబాబు నాయుడు ఇటువంటి ఉద్యమాలు సృష్టిస్తున్నాడని అన్నారు. ఇందులో భాగంగానే దళితుల పేరు జపిస్తున్నాడని, ఈ రాష్ట్రంలోని దళితుల ప్రయోజనాన్ని అణగదొక్కిన వారే రోడ్లెక్కి మాట్లాడుతుంటే దళిత సమాజం నవ్వుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో దళితులను అణగదొక్కడంలో చంద్రబాబుది ప్రత్యక్ష పాత్ర అయితే, పరోక్ష పాత్ర ఈనాడు, ఏబీఎన్, టీవీ5లది అన్నారు. టీడీపీ అండ్ కో.. కు  కావాల్సింది స్టేట్‌ కాదు రియల్‌ ఎస్టేట్‌ మాత్రమేనని తెలిపారు. చంద్రబాబు ఇక్కడ ఉండటం లేదుకానీ, ఆయన మనసంతా అమరావతి భూముల మీదేనని, వాటి మీద తాను లాక్కోవాలని పెట్టుకున్న వేల కోట్ల సంపద మీదేనని నందిగం సురేష్ దుయ్యబట్టారు. 
 
ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే.. అమరావతి పేరుతో 600వ రోజు ఉద్యమం సందర్భంగా మాట్లాడిన భాష జుగుప్సాకరం. వాళ్లు ఏం మాట్లాడారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. దానికి  దళితుల రంగు పులమాలని చూశారు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు కష్టాలు వచ్చినా..  దళితులను తెరపైకి తెస్తారు, వారిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తాడు. అందులో భాగంగానే  నిన్న ఇదంతా జరిగింది. ఎస్సీ నియోజకవర్గంలో అభివృద్ధి చేపడుతుంటే ధ్వంసం చేస్తున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి జవహర్‌ తో మాట్లాడించారు.  చంద్రబాబు అసలు అమరావతిలో ఎక్కడ అభివృద్ధి చేస్తే.. అది ఎక్కడ ధ్వంసం అయిందో నిరూపిస్తే బాగుండేది. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు, తన బినామీలు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులను కాపాడుకోవడానికే ఈ ధర్నాలు, దీక్షలు చేయిస్తున్నారు తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం,  దళితుల మేలుకోరే విధంగా ముఖ్యమంత్రి జగన్ గారు కృషి చేస్తుంటే... ఇక్కడేదో అన్యాయం జరిగిపోతున్నట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు
 
 
రాజధానిలో అంటే అమరావతిలో దళితులకు జరిగిన అన్యాయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే..
అన్యాయం–1: అసైన్డ్‌ భూములను దళితులను వంచించి కొనుగోలు చేయడం.
అన్యాయం–2: దళితులను వంచిస్తూ కోట్లు తమకు కురిపిస్తాయనుకున్న భూములను లక్షల్లో కొనుగోలు చేసి వీడియోలు తీసుకోవడం.
అన్యాయం–3: ఈ విషయంపై ల్యాండ్‌ పూలింగ్‌ డ్రామా జరుగుతున్న రోజుల్లో గొంతెత్తిన దళితులను అధికార వ్యవస్థతో బెదిరించడం.
 
 
దళితుల గురించి పేరు ఎత్తే అర్హత కూడా చంద్రబాబుకు లేదు. గతంలో దళితులగా ఎవరూ పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకూ కూడా ఆ మాట తాను అనడం తప్పైంది, దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అనిగానీ చెప్పకుండా, ఇప్పటికీ తాను అన్నమాటకు కట్టుబడి రాజీపడకుండా పని చేస్తున్నారు. చంద్రబాబు దళితుల పట్ల ప్రత్యక్షంగా ఉక్కుపాదం మోపి, వారిపట్ల చిన్నచూపు చూస్తుంటే అందుకు పరోక్షంగా ఏబీఎన్‌, టీవీ5, ఈనాడు వత్తాసు పలుకుతూ దళితులను కించపరుస్తూ చిన్నచూపు చూస్తున్నారు. దళితుల్ని ఎవరు కించపరిచారు, ఎవరు చిన్నచూపు చూశారంటే... రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసినప్పుడు మీ భూములు కూడా తీసుకుంటాం, మీ భూములకు కూడా సమాన హక్కులు కల్పిస్తామని ముందు చెప్పిఉంటే దళితులకు అప్పుడు అన్యాయం జరిగి ఉండేది కాదు. 
 
రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పుకుంటున్న చంద్రబాబు... మరి,  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అదే ప్రాంతంలో దళితులకు 54వేల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. న్యాయస్థానాల్లో వాళ్ళు  చేసిన వ్యాఖ్యలు  ఏమిటి..? దళితులకు ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని,  రాష్ట్ర రాజధాని మురికివాడగా మారిపోతుందని మాట్లాడలేదా..? అంటే దళితులు, పేదవాళ్లు ఉండే ప్రాంతం మురికివాడలా మారిపోతుందని కోర్టుకు వెళ్లినవారు ఏ రాజధానిని కోరుకుంటున్నారు. మీరు దళితుల మేలు కోరుతున్నారా? కీడు చేస్తున్నారా? మా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చదువుకుంటారనుకుంటే.. మీరు కోర్టులకు వెళ్లి అమలు కాకుండా ఆపేస్తారు. మేము సొంతింట్లో ఉండకూడదు, ఇంగ్లీష్‌ మీడియంలో చదువుకుని బాగుపడతామంటే అడ్డుపడతారు, మేము ప్రశాంతంగా బతకకూడదు. కానీ, ఇప్పుడు దళితులపై చంద్రబాబుకు ఎక్కడలేని ప్రేమ పుట్టుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇదెక్కడి దౌర్బాగ్యం. ఇటువంటివన్నీ చేస్తున్న చంద్రబాబు దళితుల కంట్లో దళితుల వేలుతోనే పొడిపించాలని మరోసారి ప్రయత్నం చేస్తున్నాడు. మరోసారి అని ఎందుకన్నానంటే.. ఎస్సీ వర్గీకరణను ప్రతిపాదించింది చంద్రబాబే. అది ఎస్సీల మీద ప్రేమతో కాదు. వారిని విభజించడానికే ఈ పని చేశాడు.
 
– బ్రిటిష్‌ వాళ్లు 1905లో బెంగాల్‌ను విభజించి పరిపాలన సౌలభ్యం కోసం అని సాకులు చెప్పినట్లే చంద్రబాబు కూడా దళితులను విభజించి దానికి ఎన్నో సాకులు చెప్పాడు.
– దళితుల మీద దాడులు అనే సబ్జెక్టు మీద ఈ రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా ఎక్కడ డిబేట్‌ జరిగినా.. దాడులన్నీ, ప్రభుత్వ పరంగా జరిగిన దాడులన్నీ ఎవరు చేయించారంటే కేవలం చంద్రబాబే కనిపిస్తున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి దళితుల కోసం పోరాడుతున్నాడా...? 
 
దమనకాండ అనే పదానికి అర్థం తెలుసా..? 
 
మీరు చేయించిన టీవీ ఉద్యమానికి, న్యూస్‌పేపర్ల ఉద్యమానికి పోలీసులు అడ్డుతగిలారట. దమనకాండ సాగిందట. దమనకాండ అనే పదానికి అర్ధం తెలుసా. ఎక్కడా 50 మంది కూడా రోడ్డు మీదకు రాని వ్యవహారాన్ని ఉద్యమం అంటున్నారు. దమనకాండ అంటే దాని అర్ధం రైతుల గుండెల మీద, బషీర్‌బాగ్‌లో మాదిరి తుపాకులు పేల్చి చంపేయడం. దమనకాండ అంటే దానర్ధం రైతుల గుండెల మీద కాల్దరిలో కాల్పులు జరిపి చంపేయడం. దమనకాండ అంటే దాని అర్ధం 9 ఏళ్ల పాలనలో ఉచిత విద్యుత్‌ ఇవ్వనని, వ్యవసాయ విద్యుత్‌కు డబ్బులు కట్టలేని రైతులను పోలీసు స్టేషన్లలో, జైళ్లలో పెట్టి వారి ఆస్తులను వేలం వేయడం.

14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇవన్నీ చేశాడు.  గుర్రపు డెక్కలతో తొక్కించి, హింసించి చంపించింది ఎవరు? అణగొక్కడం అంటే, హింసించడం అంటే, ఉన్మాదం అంటే అదీ. ఇవేవీ ఇప్పుడు జరగలేదు. అమరావతి ప్రాంతంలో..  వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం చేస్తున్న దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కేవలం మీ ఒక్కళ్ళనే అరెస్టు చేసినట్టు, అక్కడ ఏదో జరిగిపోయినట్లు హంగామా చేస్తారా..?
 
చంద్రబాబు హయాంలో కరెంట్‌ బిల్లులు కట్టని పేద, ఎస్సీ, ఎస్టీ రైతులను అరెస్ట్‌లు చేయించి, జైల్లో పెట్టించారా, లేదా? అటువంటి వ్యక్తికి ఇప్పుడు పేదల గురించి, రైతుల గురించి మాట్లాడే హక్కు ఎక్కడ నుంచి వచ్చింది? పోనీ ఇప్పటికైనా తాను చేసింది తప్పు అని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని అనకుండా తాను చేసింది కరెక్టే అన్నట్లు చెప్పడానికే ఇష్టపడుతున్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అనేకమంది దళితుల పట్ల మాట్లాడిన భాష ఇప్పటికీ ఎవరూ మరచిపోరు. ఇంకా ఆయన దళితుల గురించి ఏం మాట్లాడతారా? ఇప్పటికైనా చంద్రబాబు దళితుల పట్ల మాట్లాడిన భాషపై నోరు విప్పరే?. అలాంటిది హఠాత్తుగా దళితులపై ఎక్కడ నుంచి వచ్చింది ఇంత ప్రేమ..?
 
అమరావతి రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అనుకుంటున్నట్టుగా,  సంపాదించిన లక్షల కోట్లును నిలబెట్టుకోవడం కోసం, ఆయన చేయించే బినామీ ధర్నాలు, దీక్షలే తప్ప మరొకటి కాదు. గతంలో ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చేది లేదని చెప్పిన దళిత రైతులపై కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా? నిజమైన ఉన్మాదం ఏంటంటే.. రాజధాని ప్రాంతం ఇక్కడకు తీసుకు వచ్చి పొలాలు తగులబెట్టించి, ఆ నెపాన్ని దళితులపై రుద్దింది మీరు కాదా? చివరకు నిరూపించలేకపోయారు కదా, కేసులు కొట్టేయించింది కూడా చంద్రబాబు ప్రభుత్వంలోనే కాదా?
 
చంద్రబాబుకు రాజకీయంగా మేలు జరగాలంటే అప్పుడు దళితులు గుర్తుకొస్తారు, మళ్ళీ అధికారంలోకి వచ్చాక అణగదొక్కేది కూడా దళతుల్నే. తన సామాజిక వర్గం తప్ప, మిగతావాళ్లు  కనీసం కడుపునిండా అన్నం తింటే కూడా భరించలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు.  చంద్రబాబు హెలికాప్టర్‌లో తిరిగినా, సైకిల్‌ మీద తిరిగినా జనాలు ఇష్టపడరు. చంద్రబాబు ఎప్పుడూ తనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు బాగుపడేందుకు మాత్రమే పని చేస్తారు. ఇలాంటి వ్యక్తులు దళితుల మేలు కోరేవిధంగా మాట్లాడేందుకు కూడా అర్హులుకారు.
 
చంద్రబాబు నాయుడు ఉన్మాదం అంటే ఎలా ఉంటదో ఆయన అధికారంలో ఉన్న 14ఏళ్లు ప్రజలు అనుభవించారు. చంద్రబాబు ఉన్మాదాన్ని భరించలేకే ప్రజలు ఛీకొట్టి.. జగన్‌ మోహన్‌ రెడ్డిగారికి అధికారం ఇచ్చారు. దళతులపైనే కాదు, బీసీలపైనా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఆ వర్గాల ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పోనీ ఇప్పటికైనా ఆయన తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతానని అంటారా అంటే అదీ లేదు? 
 
మీడియాను అనుమతించకపోతే..  శాంతియుతంగా పోలీసులు మీ డబ్బా ఉద్యమకారులను తరలిస్తున్న ఫోటోలు ఎక్కణ్నుంచి వచ్చాయి. అది కూడా హెచ్‌డీ క్వాలిటీ ఫోటోలు ఎక్కణ్నుంచి వచ్చాయి. ఒక దళితుడి వేదన అనేది ఇదే 600 రోజులుగా మరో ఉద్యమం, నిజమైన ఉద్యమం రూపంలో కనిపిస్తోంది. బాబు వేయించిన టెంట్లలో ఉండే వ్యక్తులెవరో సామాజిక న్యాయం కోసం, ప్రాంతీయ న్యాయం, ఇక్కడే అమరావతిలో ఇళ్ల పట్టాల కోసం పోరాడుతున్న వ్యక్తులెవరో అందరికీ తెలుసు.
 
– మా సామాజికవర్గాల పోరాటం మాది. మా పోరాటాన్ని ఏనాడూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టవీ5, ఇతర చంద్రబాబు ఎల్లో ఛానళ్లలో చూపించరు. వారికి మేము ఎప్పటికీ అంటరాని వాళ్లమే.
– మీడియా పరంగా అన్‌టచబిలిటీ అంటే ఏమిటో కూడా ఇప్పుడు ప్రపంచం చూస్తోంది. 
– నేటికీ అటు చదువుపరంగా కానివ్వండి. ఇటు మీడియాపరంగా కానివ్వండి. భూములపరంగా కానివ్వండి. అన్నీ మావే అన్న పద్ధతుల్లో చంద్రబాబు, ఆయన మనుషుల అరాచకాల మీద మేము తిరగబడుతూనే ఉంటాం.
– కాబట్టి పేదల కోసం చేస్తున్న మా ఉద్యమం గురించి సింగిల్‌ కాలమ్‌ వార్త కూడా రాయని ఆ పత్రికలు, వేయని ఆ ఛానళ్లు ఏ సామాజిక ప్రయోజనాల కోసం ఈరోజు అమరావతిని వాడుకుంటున్నారో, ఎవరి ఆర్థిక ప్రయోజనాల కోసం అమరావతి అంటున్నారో ప్రజలందరికీ అర్ధమైంది. కాబట్టే గుంటూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో 57కు 44 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు దీవించి ఇస్తే, విజయవాడ కార్పొరేషన్‌లో 64కు 49 వైయస్సార్‌ కాంగ్రెస్‌కు ఇచ్చారు. గుంటూరులో టీడీపికి వచ్చినవి 9. విజయవాడలో వచ్చినవి 14.
 
రెండేళ్ల పాలన తర్వాత ఇదే విజయవాడ, గుంటూరు ప్రజలు పో పోవయ్య చంద్రబాబు అని ఇంత స్పష్టంగా చెబుతున్నా చంద్రబాబు మనిషిగా ఇక్కడ ఉండడం లేదు కానీ, ఆయన మనసంతా అమరావతి భూముల మీద, వాటి మీద తాను లాక్కోవాలని పెట్టుకున్న వేల కోట్ల మీద మాత్రమే ఉందని ప్రజలందరికీ బాగా అర్ధమైంది.
 
కచ్చితంగా చెబుతున్నాం.. చంద్రబాబు నాయుడు బినామీల ఆస్తుల్ని కాపాడుకునేందుకు చేస్తున్నదే అమరావతి ఉద్యమం. ఈరోజు దళితుల గురించి లేని ప్రేమను ఒలకబోస్తూ మాట్లాడుతున్న జవహర్, నక్కా ఆనందబాబు లాంటి టీడీపీ నాయకులు.. ఇదే రాజధాని ప్రాంతంలో దళితులపై దాడులు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? దాడులు చేస్తుంటే మీరు కనీసం ఖండించారా? అటువంటి మీరు ఈరోజు ప్రభుత్వంపై నిందలు వేస్తే ప్రజలు నమ్మే స్థితిలోలేరు. 
 
జగన్‌ మోహన్‌ రెడ్డిగారి పరిపాలనలో అమరావతి ప్రాంతంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అందరికి న్యాయం చేస్తారు. కృష్ణా కరకట్ట అభివృధ్ది విషయంలో కోర్టులకు వెళ్ళి, దాన్ని ఆపాలని చూసింది ఎవరో కూడా అందరికీ తెలుసు. మంచితనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దు. దయచేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వండి. అంతేకానీ కులపిచ్చి, డబ్బు పిచ్చి, అధికారం పిచ్చితో మాట్లాడే చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాయొద్దు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

212 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డ.. ఆపిల్‌ పండు కన్నా తక్కువే..