Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంటిబిడ్డతో యువ ఐఏఎస్ అధికారిణి విధులు - మీరు చాలా గ్రేట్ మేడం అంటూ...

Advertiesment
Srijana Gummalla
, సోమవారం, 13 ఏప్రియల్ 2020 (15:30 IST)
ప్రపంచమంతా కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నారు. ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా, పదేళ్ళలోపు చిన్నారులు, 65 యేళ్ళు పైబడినవారు బయటతిరగొద్దని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే, ఓ యువ ఐఏఎస్ అధికారిణి మాత్రం ఉద్యోగం పట్ల ఉన్న మక్కువతో చంకలో బిడ్డతో విధులకు హాజరవుతోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి షోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే దాన్ని చూసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్... తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఈ యువ అధికారిణిని చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలంటూ కోరారు. ఇంతకీ ఆ యువ ఐఏఎస్ అధికారిణి ఎక్కడ పని చేస్తుందో, ఆమె వివరాలు ఏంటో తెలుసుకుందాం. 
 
ఆమె పేరు సృజన గుమ్మళ్ళ. గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె నెల రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఇపుడు కరోనా వైరస్ భయంతో ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. స్థానిక సంస్థల్లో పనిచేసే అధికారులంతా విధుల్లో నిమగ్నమైవున్నారు. 
 
అలాంటి వారిలో సృజన గుమ్మళ్ళ ఒకరు. నెల రోజుల క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చిన సృజన.. తనకున్న మెటర్నిటీ సెలవులను కూడా వాడుకోకుండా కరోనా నేపథ్యంలో ప్రజలకు సేవ చేయడానికి బిడ్డను ఎత్తుకుని కార్యాలయానికి వస్తున్నారు. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌ సృజన గుమ్మళ్ళ విధి నిర్వహణలో చూపిస్తోన్న నిబద్ధతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  
 
కరోనా విజృంభణ సమయంలో విధులు నిర్వహించడం ఓ మనిషిగా ఇది తన బాధ్యతని ఆమె చెప్పారు. తాను తిరిగి విధుల్లో చేరితే తమ పరిపాలన విభాగానికి కాస్త సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. ఈ సమయంలో అందరూ కలిసి పని చేస్తే ఈ పోరులో మరింత బలం చేకూరుతుందని ఆమె అంటున్నారు. ఆమె 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందని అధికారిణి.  
 
కాగా, ఆమె చంకలో బిడ్డతో ఆస్పత్రికి వచ్చి విధులు నిర్వహిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది. ఇది కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దృష్టిలో పడింది. అంతే.. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 'కరోనాపై పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టం. పని పట్ల నిబద్ధత చూపుతూ అటువంటి యోధులకు ఓ ఉదాహరణగా నిలుస్తోన్న ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆ ఐఏఎస్‌ అధికారిణి ఫొటోను కూడా పోస్ట్ చేశారు. తనకున్న ఆరు నెలల ప్రసూతి సెలవులను రద్దు చేసుకుని మరీ ఆమె విధుల్లో చేరడం పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 'మీరు చాలా గ్రేట్ మేడమ్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. అనవసరంగా సెలవులు పెట్టి ఇంట్లో ఉండే అధికారులు ఆమెను చూసి నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత బ్యాంకులపై కన్నేసిన డ్రాగన్ కంట్రీ : హెచ్‌డీఎఫ్‌సీలో వాటా