ఏపీ వైద్య ఆరోగ్య శాఖామంమత్రి విడదల రజనీ బోరున విలపించారు. వెక్కివెక్కి ఏడ్చారు. ఈ రాజకీయ భిక్ష మీరు పెట్టిందంటూ ఆమె విలపించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేనా ఏపీ సీఎం జగన్ గెలుపు ఉండబోతుందని ఆమె జోస్యం చెప్పారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం చేతుల మీదుగా ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, చంద్రబాబు హయాంలో వైద్య రంగానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ వంటి ఒక నేతకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఏం చేయొచ్చే గత నాలుగేళ్ల కాలంలో చేసి చూపించారని చెప్పారు. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా భూమి చీలినా, నింగి కుంగినా, అన్యాయానికి ఓటమి తప్పదన్నారు. బాబుకు, టీడీపీకి ఓటమి తప్పదన్నారు. జగనన్న గెలుపు తథ్యమన్నారు.
ఒక సాధారణ మహిళనైన తనకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన జగనన్నకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్ మీరు పెట్టిన భిక్షేనటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, రజనీ కంటతడి పెట్టారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య రంగంలో చరిత్ర సృష్టించారని, మళ్లీ ఇపుడు సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానంతో నవశకం లిఖించనున్నారని ఆమె పేర్కొన్నారు.