Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులు - జగిత్యాల ఛైర్‌పర్సన్ రాజీనామా

Advertiesment
sravani
, గురువారం, 26 జనవరి 2023 (11:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతల ఆగడాలు నానాటికి శృతిమించిపోతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ అధికారులను వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా వేధించారు. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అడుగడుగునా వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఆరోపించారు. పైగా, డబ్బులు ఇవ్వాలంటూ తనను డిమాండ్ చేశారని ఆమె బోరున విలపిస్తూ చెప్పారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులను భరించలేకే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శ్రావణి ప్రకటించారు. 
 
ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త' అని సంజయ్ బెదిరించారని... డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని దొర అహంకారంతో తనపై కక్షకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అభివృద్ధి పనులకు అడ్డుతగిలారని... మున్సిపల్ ఛైర్మన్ పదవి తనకు నరకప్రాయంగా మారేలా చేశారని చెప్పారు. 
 
ఎమ్మెల్యే పదవితో పోలిస్తే నీ పదవి ఎంత అని తనను అవమానించేలా కించపరిచారన్నారు. చెప్పకుండా ఒక వార్డును సందర్శించినా ఆయన దృష్టిలో నేరమేనని చెప్పారు. తన చేతుల మీదుగా ఒక్క పని కూడా ప్రారంభంకాకుండా చేశారని అన్నారు. పేరుకే తాను మున్సిపల్ ఛైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యేదే అని దుయ్యబట్టారు. ఆయన ఇచ్చిన స్క్రిప్టునే తాను చదవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
చివరకు పార్టీ నేతలైన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించకూడదు, వారిని కలవకూడదని హుకుం జారీ చేశారని చెప్పారు. సంజయ్ కుమార్‌తో తమ ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే ఎమ్మెల్యేనే కారణమని అన్నారు. తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నానని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి సేవలో నారా లోకేశ్ - రేపటి నుంచి పాదయాత్ర