Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోమంత్రి చినరాజప్పపై మండిపడుతున్న కాపులు: భవిష్యత్తు కోసం మల్లగుల్లాలు

ముద్రగడ పద్మనాభంపై తెలుగు దేశం ప్రభుత్వం చేపట్టిన అణచివేత వైఖరితో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాపులు ప్రభుత్వ దమననీతికి వత్తాసు పలికిన ఏపీ హోం మంత్రి చినరాజప్ప అంటేనే మరింతగా మండిపడుతున్నారు.

హోమంత్రి చినరాజప్పపై మండిపడుతున్న కాపులు: భవిష్యత్తు  కోసం మల్లగుల్లాలు
హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (01:54 IST)
ముద్రగడ పద్మనాభంపై తెలుగు దేశం ప్రభుత్వం చేపట్టిన అణచివేత వైఖరితో తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాపులు ప్రభుత్వ దమననీతికి వత్తాసు పలికిన ఏపీ హోం మంత్రి చినరాజప్ప అంటేనే మరింతగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో వణికిపోతున్న హోంమంత్రికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీలో ఎవరి వైపు నిలిస్తే ఎక్కడ కొంప మునిగుతుందో అని గుంజాటన పడుతున్నారు. 
 
తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం టీడీపీలో సంకుల సమరానికి తెరలేచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుండటంతో ఆ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్సీ భాస్కర రామారావు రెండోసారి బరిలో నిలుస్తున్నట్టు ఆయన అనుచరగణం ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేస్తోంది. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబుతో మాట్లాడేందుకు వెళ్లడం అందులో భాగమేనంటున్నారు. 
 
సిటింగ్‌ ఎమ్మెల్సీకి రాజకీయంగా బద్ధవిరోధి అయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి వంటి నేతలు భాస్కర రామారావు వ్యతిరేకులందరినీ ఏకం చేస్తున్నారని  పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కాపు ఉద్యమంలో జిల్లా నుంచి ముద్రగడ పద్మనాభం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో ఈసారి ఆ సామాజిక వర్గానికి కేటాయించాలనే ప్రతిపాదన వచ్చింది. పార్టీలో సీనియర్‌ అయిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు లేదా, కోనసీమ కేంద్రం అమలాపురం నుంచి దివంగత మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు తనయుడు మెట్ల రమణబాబు పేర్లు ప్రముఖంగా ఆ సామాజికవర్గ నేతలు బాబు వద్ద పరిశీలనలోకి తీసుకువెళ్లారు. ఈ రెండు పేర్లు పరిగణనలోకి తీసుకోవాలని ఆ సామాజికవర్గానికి చెందిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధినేత దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం.
 
రమణబాబు, చిక్కాల విషయంలో మొదట సానుకూలత వ్యక్తం చేసిన చినరాజప్ప తాజా రాజకీయ సమీకరణల్లో భాస్కర రామారావు వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం. ప్రధానంగా రెండు కారణాలను ఇందుకు నేతలు విశ్లేషిస్తున్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆర్థిక మంత్రి యనమల చాలాకాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అటువంటి యనమలకు విరోధి అయిన ఎంపీ తోట ప్రతిపాదిస్తున్న అతని బావమరిది రమణబాబుకు సానుకూలంగా ఉంటే, భాస్కర రామారావుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన యనమలతో దూరం ఏర్పడుతుందని చినరాజప్ప మనసు మార్చుకున్నారంటున్నారు.
 
రెండోది తన రాజకీయ భవిష్యత్తు ఒకప్పుడు పెద్దాపురం బొడ్డు భాస్కర రామారావుకు పెట్టనికోట. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప 2019 ఎన్నికల్లో తిరిగి అక్కడి నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురంలో ‘బొడ్డు’ అడ్డు ఉండదనే ముందుచూపుతోనే చినరాజప్ప ప్లేటు ఫిరాయించారంటున్నారు. ఇది చినరాజప్ప రాజకీయ భవిష్యత్తుకు ఎంతవరకు ఉపకరిస్తుందో ఇప్పుడే అంచనాకు రావడం పొరపాటే అవుతుంది. కానీ జిల్లాలో పోలీసుల సాయంతో కాపు ఉద్యమంపై ఉక్కుపాదం మోపిన చినరాజప్పపై ఆ సామాజికవర్గం ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇప్పుడు తమ సామాజిక వర్గానికి వచ్చే అవకాశాన్ని కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం పణంగా పెడుతున్నారని టీడీపీలోని కాపు వర్గీయులు కూడా రాజప్పపై మండిపడుతున్నారు. 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత దౌర్జన్యం చూడలేదు: కోదండరాం ఆవేదన