Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత దౌర్జన్యం చూడలేదు: కోదండరాం ఆవేదన

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా ఇంతటి దౌర్జన్యాన్ని తాము చూడలేదని టీజేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పినా కూడా వెంటపడి వేధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసుల

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఇంత దౌర్జన్యం చూడలేదు: కోదండరాం ఆవేదన
హైదరాబాద్ , గురువారం, 23 ఫిబ్రవరి 2017 (01:32 IST)
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కాలంలో కూడా ఇంతటి దౌర్జన్యాన్ని తాము చూడలేదని టీజేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని చెప్పినా కూడా వెంటపడి వేధించారని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసుల తీరు దారుణమని.. ఇది అప్రజాస్వామికమని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేంత వరకూ పోరాడుతామని స్పష్టం చేశారు. మంగళవారం అర్ధరాత్రి కోదండరాంను అరెస్టు చేసిన పోలీసులు బుధవారం సాయంత్రం విడిచిపెట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని తార్నాకలో ఉన్న తన నివాసం వద్దకు చేరుకున్న కోదండరాం.. అక్కడ విలేకరులతో మాట్లాడారు. 
 
‘‘తెలంగాణ ఉద్యమం సందర్భంగా అరెస్టు చేయని వారిని కూడా ఇప్పుడు అరెస్టు చేశారు. నాతో పాటు జేఏసీ నేతలను అరెస్టు చేసిన తీరు దారుణం. పోలీసులు మా ఇంటిమీద పడి, తలుపులను విరగ్గొట్టారు. లోపలికి ప్రవేశించాక దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఉదయం తామే వస్తామని చెప్పినా వినకుండా ఈస్ట్‌జోన్‌ డీసీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించారు’’అని వెల్లడించారు.
 
నిరుద్యోగ ర్యాలీ, సభలకు అనుమతి కోసం 20 రోజుల ముందుగానే దరఖాస్తు చేసుకున్నామని.. కానీ పోలీసులు కావాలనే తాత్సారం చేసి నాగోల్‌ సభ పెట్టుకోవాలని చెప్పారని కోదండరాం తెలిపారు. కొంత ముందుగా అవకాశమిచ్చినా నిజాం కాలేజీ మైదానంలో సభ పెట్టుకునే వాళ్లమన్నారు. నిరసన తెలిపే కనీస హక్కును ప్రభుత్వం కాలరాసిందని మండిపడ్డారు. నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని, ప్రజాస్వామ్యానికి లోబడి శాంతియుతంగానే నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని కోదండరాం పేర్కొన్నారు. తాము ఎలాంటి కుట్రలూ చేయడం లేదని.. జేఏసీలో అసాంఘిక శక్తులు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు.
 
నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అవసరమైతే రాజకీయ పార్టీలను సైతం కలుపుకొని ముందుకు వెళతామని చెప్పారు. టీజేఏసీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ విజయవంతమైందని, దానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. గురువారంనాటి బంద్‌కు టీజేఏసీ, ప్రజా సంఘాల తరఫున మద్దతు ప్రకటిస్తున్నామని కోదండరాం తెలిపారు. దానిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు కోదండరాం అక్రమ అరెస్టుకు నిరసనగా ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిష్టిబొమ్మ దహనంచేశారు.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాటల్తో పడగొడతాడా పవన్‌, 2019 ఎన్నికల్లో జనసేనాని పవర్ ఏంటో?