కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. 44వ జాతీయ రహదారిపై వెల్దుర్తి క్రాస్ రోడ్డు సమీపంలో వోల్వో బస్సు, తుఫాన్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. వేగంగా దూసుకువచ్చిన బైక్‌ను తప్పించబోయిన వోల్వో బస్సు... అవతలివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
మృతులంతా పెళ్లి చూపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వెళ్తున్న వోల్వో ప్రైవేట్ ట్రావెల్ బస్సు మితిమీరిన వేగంతో రావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని కర్నూలు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెల్దుర్తి ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెల్దుర్తి రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన వైఎస్ జగన్... క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.