టిటిడి తలపెట్టిన ఉచిత సామూహిక వివాహాల ( కల్యాణమస్తు) కార్యక్రమాన్ని కోవిడ్ - 19 నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
తిరుపతి పరిపాలన భవనంలో కల్యాణమస్తు కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మే 28వ తేదీ శ్రీ ప్లవనామ సంవత్సరం వైశాఖ మాస బహుళ విదియ శుక్రవారం మూల నక్షత్రం సింహ లగ్నంలో మధ్యాహ్నం 12.34 నుండి 12.40 మధ్య సామూహిక వివాహలు నిర్వహించాలని టిటిడి నిర్ణయించిందన్నారు.
అయితే కోవిడ్ - 19 పరిస్థితుల కారణంగా జిల్లా కేంద్రాల్లో ఒకే చోట ఎక్కువ మంది జనం గుమికూడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుదని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతి నియోజక వర్గ కేంద్రంలో కల్యాణమస్తు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రతి జిల్లాలో కనీసం 300 జంటల వివాహాలు చేయడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ల సహకారం కోరుతూ లేఖలు రాయాలని ఈవో అధికారులను ఆదేశించారు. జంటల నమోదు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలన్నారు.
వివాహం చేసుకునే జంటలకు రెండు గ్రాముల మంగళసూత్రం, వస్త్రాలు, వెండి మెట్టెలు, పుస్తక ప్రసాదం, శ్రీ పద్మావతి శ్రీనివాసుల ల్యామినేషన్ ఫోటో, భోజనాలు తదితర ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు. ఏప్రిల్ చివరిలో కల్యాణమస్తుపై మరోసారి సమీక్షించనున్నట్లు ఈవో చెప్పారు.