స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులు బరిలోకి దిగకుండా అడ్డుకునే లక్ష్యంతో అధికార వైఎస్ఆర్ సీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలపై జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ బి. మహేందర్ రెడ్డి మంగళవారం రాత్రి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
జనసేన పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్ధులు బరిలోకి దిగకుండా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి అని, అధికారుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు చించివేయడం, ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషనులు దాఖలు చేయడానికి వెళ్తున్న జనసేన అభ్యర్ధులను, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డిలను వైసీపీ శ్రేణులు అడ్డుకుని నామినేషన్ పత్రాలు చించివేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా మార్గం మధ్యలో రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనసేన కార్యకర్తలకు గాయాలయ్యాయి.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు, పులిచెర్ల, పుంగనూరు, ఎర్రవారిపాలెంలలో జనసేన పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయాలను ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఐపిఎస్ అధికారి శ్రీ ఐశ్వర్య రస్తోగిని కలిసి దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు