Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పులు వేలెత్తి చూపితే బురద చల్లుతారా? వైకాపా నేతలపై పవన్ ఫైర్

Advertiesment
తప్పులు వేలెత్తి చూపితే బురద చల్లుతారా? వైకాపా నేతలపై పవన్ ఫైర్
, బుధవారం, 22 ఏప్రియల్ 2020 (17:35 IST)
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న వారిపై బురదచల్లే ప్రయత్నం చేయడం ఏమాత్రం సబబు కాదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ నిజ నిర్ధారణ కోసం సౌత్ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్స్‌ను దిగుమతి చేసుకుంది. వీటిని అధిక చెల్లించి కొనుగోలు చేసినట్టు వచ్చాయి. ముఖ్యంగా, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు ఘాటుగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. వీటిపై ఇపుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. 
 
కరోనా నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలను అందించాల్సిన తరుణంలో... తప్పులను వేలెత్తి చూపుతున్న వారిపై వైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని విమర్శించారు. కన్నాపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఇందులో భాగంగానే కనిపిస్తున్నాయన్నారు. కన్నాపై జరుగుతున్న దాడి ప్రజాస్వామ్యవాదులు ఖండించాల్సిన రీతిలో, ఆయనకు క్షమాపణలు చెప్పాలని అడగాల్సిన స్థాయిలో ఉందని పేర్కొంటూ ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 
 
ఏపీలోని వైపాకా సర్కారు కరోనా అడ్డుకట్ట చర్యల కంటే రాజకీయాలపైనే దృష్టిపెట్టినట్టుగా ఉందన్నారు. రెండు, మూడు రోజులుగా ఇలాంటి పరిణామాలే జరుగుతున్నాయని చెప్పారు. ప్రపంచాన్ని కరోనా వైరస్ ఆక్రమిస్తున్న కారణంగా అగ్ర రాజ్యాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయని, వాటి ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోందని అన్నారు. 
 
రోగులందరికీ వైద్య సేవలు అందించలేక అగ్రదేశాలు అవస్థలు పడుతున్నాయని.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి మందులను పంపమని భారతదేశాన్ని ప్రాధేయపడుతున్నాయని గుర్తుచేశారు. ఇంకో పక్క పెట్రోల్ ధరలు పాతాళంలోకి పడిపోయి చమురు ఉత్పత్తి దేశాలు దిక్కులు చూస్తున్నాయని అన్నారు. ఈ  పరిణామాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనపై ప్రభావాన్ని చూపేవేనని చెప్పారు.
 
మన దేశంలో లక్షలాది మంది కార్మికులు ముఖ్యంగా వలస కార్మికులు ఉపాధి కోల్పోయి, ఊరుకాని ఊర్లో ఉంటూ, అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు తమ పంటను అమ్ముకునే దారి లేక పెంటకుప్పల్లో పోస్తున్నారని చెప్పారు. ఏపీపై కూడా కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉందని అన్నారు. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. 
 
కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపే వారిపై వైసీపీ పెద్దలు బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
ఈ ఆపత్కాల సమయంలో జనసేన ఒకటే కోరుతోందని... రాష్ట్రాన్ని, దేశాన్ని కరోనా రక్కసి వదిలిపెట్టి పోయేంత వరకు చిల్లర రాజకీయాలను దూరంగా పెడదామని పవన్ అన్నారు. ప్రజలను రక్షించుకోవడం, వారి సంక్షేమం, అవసరాలు, ఆకలిదప్పులను తీర్చడంపై దృష్టిని కేంద్రీకరిద్దామని చెప్పారు. ఈ సమయంలో కూడా రాజకీయాలను ఆపకపోతే ప్రజలు తిరగబడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ నుంచి కోలుకున్న 85 యేళ్ళ భామ ... కానీ, ఆమె కుమారుడు...