ఏపీలో వైకాపాదే గెలుపు అని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఒపీనియల్ పోల్ అంచనా వేసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో మొత్తం వైకాపా, టీడీపీ మధ్యనే పోటీ వుండవచ్చునని పోల్ అంచనా వేసింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి.
కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని... అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. అలాగే తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది.
కానీ ఏపీలో మాత్రం ఈ జాతీయ పార్టీలు... రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఇంకా జాతీయంగా దక్షిణ భారతదేశంలో 132 స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 38, ఇండియా కూటమి 60, ఇతరులు 32 గెలుచుకోవచ్చునని ఈ సర్వే అంచనా వేసింది. అలాగే కర్ణాటక లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ సీట్లను బీజేపీ దక్కించుకోగలుగుతుంది.
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్- 11, వామపక్షాలకు చెందిన ఎల్డీఎఫ్- 6, బీజేపీ- 3 చోట్ల గెలుస్తాయి. తమిళనాడులో డీఎంకే-20, కాంగ్రెస్-6, బీజేపీ-5, ఏఐఏడీఎంకే-5 స్థానాల్లో విజయం సాధిస్తారని తాజా పోల్ అంచనా వేసింది.