Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లడ్ శాంపుల్స్ ఇవ్వకపోవడం ప్రైవసీనా.. దొంగాటా.. తప్పు చేయకపోతే భయమెందుకు?

నిన్నటివరకు సిట్ విచారణలో స్వచ్చందంగా రక్తనమూనాలు ఇవ్వడానికి సిద్ధపడిన టాలీవుడ్ నటులు ఉన్నట్లుండి రూట్ మార్చారు. మా బ్లడ్ శాంపుల్స్ ఇవ్వబోమని చెప్పేశారు. ఈ కోవలో తొలి అడుగు హీరో నవదీప్‌ది. సోమవారం నాంపల్లిలోని అబ్కారీ ఆఫీసుకు వచ్చిన నవదీప్ 11 గంటలపాట

బ్లడ్ శాంపుల్స్ ఇవ్వకపోవడం ప్రైవసీనా.. దొంగాటా.. తప్పు చేయకపోతే భయమెందుకు?
హైదరాబాద్ , మంగళవారం, 25 జులై 2017 (03:08 IST)
నిన్నటివరకు సిట్ విచారణలో స్వచ్చందంగా రక్తనమూనాలు ఇవ్వడానికి సిద్ధపడిన టాలీవుడ్ నటులు ఉన్నట్లుండి రూట్ మార్చారు. మా బ్లడ్ శాంపుల్స్ ఇవ్వబోమని చెప్పేశారు. ఈ కోవలో తొలి అడుగు హీరో నవదీప్‌ది. సోమవారం నాంపల్లిలోని అబ్కారీ ఆఫీసుకు వచ్చిన నవదీప్ 11 గంటలపాటు విచారణకు సహకరించినప్పటికీ రక్త నమూనాలు ఇవ్వడానికి ససేమిరా అన్నాడు. కేసుకు సంబంధించిన అనేక వివరాలను అధికారులు తననుంచి రాబట్టినట్లు సమాచారం.
 
శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరణ విచారణ సందర్భంగా నవదీప్‌ డ్రగ్స్‌ వినియోగించాడా లేదా అనేది తెలుసుకునేందుకుగా ఆయన రక్తనమూనాలు సేకరించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఉస్మానియా వైద్యులను పిలిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నవదీప్‌ నిరాకరించడం గమనార్హం. విచారణ అనంతరం నవదీప్‌ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్‌ గురించి నాకు తెలిసింది చెప్పా. అవసరమైతే మళ్లీ కాల్‌ చేస్తామన్నారు. విచారణకోసం ఎప్పుడు పిలిచినా వస్తా..’అని నవదీప్‌ అన్నారు. రాత్రి 10 గంటలకు ఆయన ఆబ్కారీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లిపోయారు.
 
వ్యక్తుల ఇష్టాఇష్టాలతో పనిలేకుండా వారి శరీరాలను పరీక్షలకోసం ఉపయోగించరాదని గతంలో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు గొప్ప సాకుగా దొరికింది. ఇంకే.. తమ లాయర్ల సహాయంతో డ్రగ్స్ రాకెట్లో ఇరుక్కున్న సినీనటులు తమ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేది లేదు పొమ్మనేసారు. ఇక సినీనటి చార్మీ అయితే నేరుగా హైకోర్టుకే వెళ్లిపోయింది. రక్తనమూనాలు తాను ఇవ్వనని, మహిళా అధికారులే తనను విచారించాలని పిటిషన్ దాఖలు చేసింది.
 
కానీ ఈ సమయంలో ఇలా రక్తనమూనాలు ఇవ్వడానికి తిరస్కరించడం అంటే తాము తప్పు చేసినట్లు అంగీకరించడం కాదా.. ఇంత చిన్న విషయం తెలియకుండానే మన సినీనటులు చట్టాన్ని అడ్డు పెట్టుకుంటున్నారా అని అనుమానం వస్తోంది. టాలీవుడ్‌లో మాదకద్రవ్యాల ఉపయోగం ఈనాటిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ  పెద్ద ఎత్తున సాగుతోందని అర్థమయ్యాక పోలీసులు పకడ్బందీ విచారణకు సిద్ధమయ్యాక మాకేం తెలీదు. మేము తీసుకోలేదు అంటే విచారణ ప్రక్రియ ఆగిపోతుందా..
 
ఆరోపణలకు గురయిన సినీనటులు, సాంకేతిక సిబ్బంది నిజంగా డ్రగ్స్ జోలికి పోకుంటే.. తమ స్వచ్ఛతను నిరూపించుకోవడానికి ఎలాంటి విచారణకైనా ఒప్పుకోవడమే సరైన పద్ధతి. మద్యం తాగడం లాగే మాదకద్రవ్యాలను కూడా కొన్ని సందర్భాల్లో పుచ్చుకునేవారమని అంగీకరించినంతమాత్రాన భారతీయ చట్టాల సరళత ప్రకారం వారిపై కఠిన చర్యలుండవని తెలుస్తోంది. మరి బాధితులుగా చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా సిట్ కఠిన చర్యలకు తమంత తాముగా వీరెందుకు ఆజ్యం పోస్తున్నారన్నది అర్థం కాని ప్రశ్న.
 
వేళ్లమీద లెక్కపెట్టదగిన వాళ్లు తప్పితే సినీపరిశ్రమ మొత్తంగా మద్యపానానికి లోనయింది. కానీ దాన్ని పైకి చెప్పుకోవడానికి మాత్రం ధైర్యం లేదు. ఈ విషయంలో హిపోక్రసీ రాజ్యమేలుతోంది. మద్యపానమే చేయమని కపట నాటకాలాడుతున్నవారు ఇక నిజంగా డ్రగ్స్ తీసుకుంటున్నామని చెప్పడానికి ముందుకొస్తారా.. అలాగని ముందుకు రానంత మాత్రాన మీ  మాదక ద్రవ్య సేవనం విషయం బయటకు రాదా.. 
 
సిట్ విచారణలో నిండా మునిగాం అనే విషయం తెలిసి కూడా ఆరోపణలకు గురైనవారు పక్కదోవలు వెతుక్కోవడం ద్వారా అంతిమంగా  ఏ ప్రయోజనం పొందలేరు. అసలు విషయం ఏమిటంటే ఒకరిమీద నిందలేయడం కాదు కానీ టాలీవుడ్‌లో డ్రగ్స్ సేవించరు అంటే నమ్మే వారు ఎవరూ ఇప్పుడు లేరు. ఈ విషమ స్థితి నుంచి ఎలా బయటపడాలన్నది ఎవరికి వారు తేల్చుకోవలసిన విషయం. 
 
ఒక్కటి మాత్రం నిజం. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పిన విషయం ఇది. తప్పు చేసిన వాడు ఎల్లకాలం దాన్ని దాచిఉంచలేడు. ఇది సార్వత్రిక సత్యం. దీన్ని అంగీకరించడమే విజ్ఞత.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకయ్యపై కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు.. ఉపరాష్ట్రపతి పదవిపై నీలినీడలు