వెంకయ్యపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు.. ఉపరాష్ట్రపతి పదవిపై నీలినీడలు
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున అభ్యర్థిగా ఎంపికై నామినేషన్ దాఖలు చేసిన కేంద్రమాజీ మంత్రి వెంకయ్యనాయుడు సత్యసంధతకు పెను పరీక్ష ఎదురైంది. వెంకయ్య నాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్ ట్రస్టుకు తెలంగాణ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాల నుంచి మినహాయింపులు పొంద
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరపున అభ్యర్థిగా ఎంపికై నామినేషన్ దాఖలు చేసిన కేంద్రమాజీ మంత్రి వెంకయ్యనాయుడు సత్యసంధతకు పెను పరీక్ష ఎదురైంది. వెంకయ్య నాయుడు కుటుంబం నిర్వహించే స్వర్ణభారత్ ట్రస్టుకు తెలంగాణ, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాల నుంచి మినహాయింపులు పొందారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఫలితంగా ఈ ట్రస్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్‌మెంట్ అథారిటీకి రూ.రెండు కోట్ల చార్జీలు చెల్లించలేదన్నారు.
వెంకయ్యనాయుడు కుమారుడికి చెందిన హర్ష టయోటా నుంచి తెలంగాణ ప్రభుత్వం టెండర్ లేకుండానే వాహనాలు కొనుగోలు చేసిందని జైరామ్ రమేశ్ ఆరోపించారు. వెంకయ్య చైర్మన్‌గా ఉన్న బోపాల్‌లోని ఖుషాబావు ఠాక్రే స్మారక ట్రస్టుకు కూడా రూ.100 కోట్ల విలువైన 20 ఎకరాల భూమిని కేవలం రూ.25 లక్షలకు కట్టబెట్టారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఈ కేటాయింపును రద్దు చేసిందని రమేశ్ వివరించారు.
బహిరంగజీవితంలో వెంకయ్యనాయుడు పారదర్శకత, జవాబుదారీతనం, సమగ్రత, రాజకీయ స్వచ్ఛతకు చాంఫియన్‌లా ఉంటున్నందున ఈ ఆరోపణల విషయంలో వెంకయ్య తన స్వచ్ఛతను నిరూపించుకోవలసిందేనని జైరామ్ రమేష్ స్పష్టం చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వెంకయ్య కుటుంబంతో సంబంధం ఉన్న ట్రస్టులు, వ్యాపారాలకు భూములను పొందారని, వాటికి రిజిస్ట్రేషన్ చార్జీలు, పన్నులు కడా చెల్లించలేదని జైరాం ఆరోపించారు.
కానీ ఇది పాత చింతకాయపచ్చడేనని వెంకయ్య నాయుడు కొట్టిపడేశారు. తన కుటుంబంపై వచ్చిన ఈ ఆరోపణలకు తాను గతంలోనే సమాధానాలు చెప్పానని, కొత్తగా దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని వెంకయ్య తిప్పికొట్టారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనుండగా తనపై ఈ ఆరోపణలు చేశారని, ఇదే దీనివెనక ఉన్న రాజకీయ దురుద్దేశాలను వ్యక్తపరుస్తోందని వెంకయ్య విమర్శించారు.
2017 జూన్ 20న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఒక జీవోను రహస్యాంగా ఉంచినమాట నిజం కాదా..హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థకు చెల్లించాల్సిన 2 కోట్ల రూపాయల చార్జీలను చెల్లించకుండా వెంకయ్య కుమార్తె నిర్వహణలోని స్వర్ణ భారత్ ట్రస్టును మినహాయించింది నిజం కాదా అని జైరాం ప్రశ్నించారు. వెంకయ్య కుమార్తె ఆ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ కాబట్టే
ఆమెకు తెలంగాణ ప్రభుత్వం ఈ మినహాయింపునిచ్చిందన్నారు.
వెంకయ్య నాయుడు కుమారుడి యాజమాన్యం లోని హర్షా టయోటా, తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడి యాజమాన్యంలోని హిమాంషు మోటార్స్ కంపెనీల నుంచి తెలంగాణ ప్రభుత్వం రూ. 271 కోట్ల విలువైన ఆర్డర్‌ను పోలీసు వాహనాల కొనుగోలు కోసం జారీ చేసిందా చెప్పాలని జైరాం రమేష్ ప్రశ్నించారు.
వెంకయ్యనాయుడు ఈ ఆరోపణలన్నింటికీ జవాబు ఇచ్చినప్పటికీ ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్టించాలనుకుంటున్న వెంకయ్య ఈ ఆరోపణలనుంచి తప్పించుకోవడం సులభమేనా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అద్వానీకి జరిగినట్లుగా వెంకయ్యనాయుడికి కూడా ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పించడానికి లోలోపల ఏదైనా ప్రయత్నం జరుగుతోందా అని కూడా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.