బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడివుంది. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా, ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, కర్నాటక నుంచి విదర్భ, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావం కారణంగా వచ్చే 24 గంటల్లో కోస్తాతో పాటు రాయలసీమలో అక్కడక్కడ వడగళ్ళ వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
అదేవిధంగా ఏపీలోని కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శనివారం వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇక బంగాళాఖాతంలో తూర్పు గాలుల ప్రభావం అధికంగా ఉందని పేర్కొంది.
గత రాత్రి శృంగవరకు కోటలో 9 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 8 శాతం, పొన్నూరు, మంగళగిరి, గొలుగొండ్లలో 6 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. విశాఖపట్టణంలోనూ గత రాత్రి భారీ వర్షం కురిసింది.